వరి పంటల్లో పాముల సంచారం..

వరి పంటల్లో పాముల సంచారం..

  • పాము కాటుకు గురికాకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలి
  • ఆడ మగ వరి పొలాల్లో జాగ్రత్త..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటల్లో పాముల సంచారం పెరగడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం వరి పంట పూత, కాత దశలో ఉండటంతో పూత వాసనకు ఆకర్షితమై వచ్చే క్రిమికీటకాలు, కప్పలు పాములను ఆకర్షిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. దీంతో పంట చేల్లో పాములు ఎక్కువగా తిరుగుతున్నాయి.

వరి పంట మోకాళ్ల ఎత్తు వరకు పెరిగి ఉండటంతో పాములు, తేళ్లు వంటి విషప్రాణులు కనిపించకుండా ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో పంట చేల్లో పనులు చేసే రైతులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అందువల్ల రైతులు పంట చేల్లో పని చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా పూత దశలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేసే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి: వైద్యురాలు హారిక

వెలిశాల వైద్యురాలు డా. హారిక మాట్లాడుతూ.. పాముకాటుకు గురికాకుండా రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పాము కాటు వేసినప్పుడు భయాందోళనకు గురికాకుండా వెంటనే వైద్య సహాయం పొందాలని తెలిపారు.

పాముకాటు వల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని, ఆలస్యం చేస్తే ప్రాణాపాయం కలగవచ్చని హెచ్చరించారు. మూఢనమ్మకాలను నమ్మకుండా వెంటనే సమీప దవాఖానకు వెళ్లాలని సూచించారు.

పాము కాటు వేసిన వెంటనే ప్రథమ చికిత్స అందించడం ఎంతో అవసరమని, వీలైతే ఏ పాము కరిచిందో గుర్తించడం లేదా దానిని తీసుకురావడం ద్వారా సరైన చికిత్స అందించవచ్చని చెప్పారు. ప్రభుత్వ దవాఖానాల్లో పాముకాటు చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలని కోరారు.

Leave a Reply