BRS Voice | డీలిమిటేష‌న్స్ తో రాజ‌కీయ స‌మాధే … వ్య‌తిరేకించ‌క‌పోతే ఇక బానిస బతుకులే: కెటిఆర్

ద‌క్షిణాది రాష్ట్రాల గొంతు కోసే చ‌ర్య‌
కేంద్రం గుప్పిట్లోకి ఇక సౌత్ స్టేట్స్
వ్య‌తిరేకించ‌క‌పోతే ఇక బానిస బతుకులే
ఆదాయం ఇచ్చే రాష్ట్రాల‌ల‌పై ఇది కక్ష సాధింపు చ‌ర్యే
అఖిల‌ప‌క్షంలో బిఆర్ఎస్ గ‌ళం వినిపించిన కెటిఆర్

చెన్నై – ఆంధ్ర‌ప్ర‌భ – జ‌నాభా ప్ర‌తిపాదిక‌న డీలిమిటేష‌న్ జ‌రిగితే ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఇక రాజ‌కీయ స‌మాధేనంటూ హెచ్చ‌రించారు బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. ద‌క్షిణాది రాష్ట్రాల హక్కులు హ‌రించేందుకు, రాజ‌కీయ గొంతు కోసేందుకే కేంద్రం ఈ ప్ర‌తిపాద‌న‌ను ముందుకు తీసుకొచ్చింద‌ని గ‌ళ‌మెత్తారు.. చెన్నైలో నేడు జ‌రిగిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో బిఆర్ఎస్ పార్టీ గొంతును వినిపించారు. డీలిమిటేషన్ కు తాము పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెపుతోందని… డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం విలువలేకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు భారీగా పెరుగుతాయని… అప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదని అన్నారు. డీమిటేష‌న్ తో ద‌క్షిణాది రాష్ట్రాలు కేంద్రం గుప్పిట్లోకి వెళ్లిపోతాయ‌న్నారు కెటిఆర్. ఇప్ప‌డు అంద‌రం క‌లిసిక‌ట్టుగా వ్య‌తిరేకించ‌క‌పోతే బానిస బతుకులే అవుతాయ‌ని హెచ్చ‌రించారు.

దేశానికి సంప‌ద స‌మ‌కూర్చేది సౌత్ స్టేట్స్ …

దేశ జనాభాల్లో 2.8 శాతం జనాభా ఉన్న తెలంగాణ… దేశ జీడీపీలో 5.1 శాతం సమకూర్చుతోందని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే అన్ని ట్యాక్స్ ల పేరుతో తెలంగాణ నుంచి రూపాయి తీసుకుని… 25 పైసలు మాత్రమే తెలంగాణకు తిరిగి ఇస్తోందని విమర్శించారు. డీలిమిటేషన్ తో నిధుల పరంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర వివక్షకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

హైద‌రాబాద్ లో త‌దుప‌రి అఖిల ప‌క్ష సమావేశం ..

ఇది ఇలా ఉంటే త‌దుప‌రి అఖిల‌పక్ష స‌మావేశం హైద‌రాబాద్ లో నిర్వ‌హించాల‌ని చెన్నై స‌మావేశంలో నిర్ణ‌యించారు.. దీనికి హాజ‌రైన 14 పార్టీల నేత‌లు ఆమోదించారు.. నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి అప్ప‌గించారు. నిర్వ‌హ‌ణ తేదీల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు.. ఈ స‌మావేశానికి టిడిపి, జ‌న‌సేన పార్టీల‌ను కూడా ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించారు..

Leave a Reply