ప్రజల భవిష్యత్తు కోసమే అమరావతి అభివృద్థి..

ప్రజల భవిష్యత్తు కోసమే అమరావతి అభివృద్థి..
రాక్షసుల మాదిరిగా వైఎస్సార్‌సీపీ నాయకుల ప్రవర్తన..
8వ డివిజన్‌లో నిరుపేద కుటుంబానికి తోపుడు బండిని అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
పటమట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే అమరావతిని తమ ప్రభుత్వం అభివృద్థి చేస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అమరావతిలో చేస్తున్న అభివృద్థి పనులకు వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకొని రాక్షసుల మాదిరిగా వ్యవహారించడం సరికాదన్నారు. బుధవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ గాయత్రి నగర్ మోడల్ డైరీ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించారు.
స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసకొని వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. అనంతరం డివిజన్‌లోని నిరుపేద కుటుంబానికి చెందిన మచ్చ చంటికి జీవనోపాధి నిమిత్తం రూ. 15 వేల రూపాయల విలువ చేసే తోపుడు బండిని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తన సొంత నిధులతో కోనుగోలు చేసి ఉచితంగా అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు రాక్షసుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. 2014–19 సంవత్సరాల మధ్య కాలంలో రైతులను రెచ్చగొట్టడానికి అరటి తోటలను వైసీపీ నాయకులు తగుల పెట్టారని తెలిపారు. రోడ్లను తవ్వి గ్రావెల్ తీసుకువెళ్ళారని గుర్తుచేశారు. ఇప్పుడు అమరావతిలో పనులు చేస్తున్న కాంట్రాక్టరుకు చెందిన పైపులను వైఎస్సార్‌సీపీ నాయకులు దహనం చేశారని ఆరోపించారు.

ప్రజలు శాంతిని కోరుకుంటున్నారేగానీ అశాంతిని కోరుకోవడం లేదని ఉద్ఘాటించారు. రాజధానిగా అమరావతి అభివృద్థిని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, వారే ఈ పనులను చేసిఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ చేసిన ఇలాంటి పనుల వల్లనే 2024 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకు ఆ పార్టీని ప్రజలు పరిమితం చేశారని భావించారు. ప్రజల అభిమానాన్ని చూరగొని, వచ్చే ఎన్నికల్లో సీట్ల పెంపునకు ప్రయత్నించాల్సిన వైఎస్సార్‌సీపీ నాయకులు ఇలాంటి రాక్షస మనస్తత్వంతో వ్యవహరించడం సరికాదని తెలిపారు.
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే తమ ప్రభుత్వం అమరావతిని అభివృద్థి చేస్తోందన్నారు. అమరావతి అభివృద్థికి చేస్తున్న పనుల కోసం తెచ్చిన పైపులకు నిప్పు పెట్టాల్సిన అవసరం ఏమిటీ, ఎవరు చేశారనే విషయాలను ప్రజలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి ఉషారాణి, కొత్తపల్లి రమేష్, మల్లెల రామకృష్ణ, మారి రామారావు, గద్దె రంగారావు, దాసరి గాబ్రియేల్, రమణ, గడ్డం హరి, వాసిరెడ్డి లక్ష్మణరావు, గద్దె రమేష్ తదితరులు పాల్గొన్నారు.
