కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి

కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కౌలు రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కలెక్టర్ గా కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే .జగనాథం రైతు సంఘం కర్నూలు జిల్లా కార్యదర్శి కే తిమ్మయ్య మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కౌలు రైతు చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ సభల ద్వారా అసలైన కౌలు రైతులను గుర్తించి, భూ యజమాని ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులను ఏప్రిల్ నెల నుంచే జారీ చేయాలని కోరారు.

భూమి యజమానితో సంబంధం లేకుండా పంట హామీపై కౌలు రైతులకు రెండు లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ రుణాలు అందించాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రతి కౌలు రైతుకు వర్తింపజేయాలని, కౌలు రైతుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని, ప్రతి కౌలు రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డులు, ప్రత్యేక గుర్తింపు సంఖ్య జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి సి మహేష్, తుగ్గిలి మండలం రైతు నాయకుడు నరసింహులు, కల్లూరు మండల కార్యదర్శి బి బి రాముడు, పుల్లన్న, బి సుంకులు, భాష, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply