321 runs|టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంజు అదుర్స్‌

321 runs|టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంజు అదుర్స్‌

5 మ్యాచ్‌లు.. 321 పరుగులు
మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కైవ‌సం
సంజూకు ప్ర‌శంస‌ల వెల్లువ‌
అద్భుత బ్యాటింగ్‌తో భార‌త్‌కు క‌ప్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మొన్న‌టివ‌ర‌కు క్రికెట్‌లో సంజూ శాంస‌న్ పేరు చెబితే.. అత‌ను అదృష్ట‌వంతుడ‌ని చెప్పాలో.. దుర‌దృష్ట‌వంతుడు అని అనాలో తెలియ‌దు. ప్ర‌తిభ ఉన్నా అవాకాశాలు ఇవ్వ‌రా అని అభిమానులు గోల చేసేవారు. అవ‌కాశం ఇస్తే సంజూ కొన్నిసార్లు విఫ‌ల‌మ‌య్యేవాడు. ఒక్కోసారి సిరీస్‌ల‌కు ఎంపిక చేసినా జ‌ట్టులోకి తీసుకునేవారు కాదు. తీసుకున్నా దుర‌దృష్ట వ‌శాత్తు ఔట‌య్యేవాడు. అవ‌కాశాలు వినియోగించుకోడు అనే అప‌వాదు ఉండేది. అలాగే… డూ ఆర్ డై అన్న‌ట్టు ఉండేది .. అత‌ని ప‌రిస్థితి. ఒక్క మ్యాచులో స‌రిగా ఆడ‌కున్నా ప‌క్క‌న పెట్టేవారు. చాలామంది దారుణంగా విఫ‌ల‌వుతున్నా జ‌ట్టులో చోటు ఇచ్చేవారు. కానీ సంజూకు మెడ మీద క‌త్తి పెట్టి ఆడ‌తావా లేదా .. లేదంటే జ‌ట్టులో చోటు ఉండ‌దు అన్న‌ట్టు సంజూ ప‌రిస్థితి ఉండేది. ప్ర‌పంచ క‌ప్ ముందు ఆడిన సిరీస్‌లో కూడా అత‌ను పేల‌వ ఫామ్ కొన‌సాగించాడు. మొత్తానికి టీ20 ప్ర‌పంచ క‌ప్‌న‌కు ఎంపిక‌య్యాడు. కానీ మ్యాచులు ఆడుతాడ‌నే న‌మ్మ‌కం లేకుండే. అయితే అలాంటి ప‌రిస్థితి నుంచి ఇప్పుడు క‌ప్ అందించిన హీరో అయ్యాడు. అస‌లు సంజూ లేక‌పోతే ఇండియా క‌ప్ గెల‌వ‌క‌పోయేది అనే ప‌రిస్థితి తీసుకొచ్చాడు. త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో భార‌త్‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ అందించాడు. ఒక‌ప్పుడు తిట్టిన వారే ఇప్పుడు అంద‌రూ పొగుడుతున్నారు.

టి20 ప్రపంచకప్ 2026 ఛాంపియన్‌గా భారత జట్టు నిలిచింది. ఈ ప్రపంచకప్ సంజూ సామ్సన్‌కు తీపి గుర్తుగా మిగిలిపోయింది. 2024 టి20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సంజూ సామ్సన్ భాగంగా ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక ఈ టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు కూడా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడ్డాడు. గ్రూప్ దశలో కేవలం నమీబియాపై మాత్రమే ఆడాడు. ఇక సూపర్ 8లో సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆడలేదు. అయితే అభిషేక్ శర్మ పేలవ ఫామ్ కారణంగా సంజూ సామ్సన్‌‌కు జింబాబ్వేతో జరిగిన పోరులో అవకాశం దక్కింది. అయితే అందులో 8 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. దాంతో అతడిని వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కొనసాగించారు. ఇక ఇక్కడి నుంచి టీమిండియా రాత మారింది. అతడి రాతతో పాటు టీమిండియా రాతను కూడా మార్చేశాడు.

క్వార్టర్ ఫైనల్ లాంటి పోరులో వెస్టిండీస్‌పై 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీమిండయాను ఒంటి చేత్తో సెమీఫైనల్లో నిలిపాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో 89 పరుగులు చేశాడు. మరోసారి టీమిండియా విజయానికి కారణం అయ్యాడు. ఇక ఫైనల్లో కూడా సంజూ సామ్సన్ 89 పరుగులతో చెలరేగాడు. టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన సంజూ సామ్సన్ 321 పరుగులు చేశాడు. జట్టుకు అవసరం అయిన ప్రతిసారి నిలబడి టీమిండియాను గెలిపించాడు. నీ వల్ల జట్టుకు దమ్మిడి ఉపయోగం లేదన్న వారే నీ వల్లే ప్రపంచకప్ గెలిచాం అంటూ సంజూ సామ్సన్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారు. అవకాశాలు రాకపోయినా.. వేరే వాళ్లకు కట్టబెట్టినా తన కష్టాన్నే నమ్ముకున్న సంజూ సామ్సన్ ఇప్పుడు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.

Leave a Reply