అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

బాల్కొండ, ఆంధ్రప్రభ ; నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని వన్నెల్ (బి) గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఆలయ పురోహితుడు అనిల్ శర్మ ఆధ్వర్యంలో పూర్ణాహుతి, ఉత్సవమూర్తులకు డబ్బు చప్పుడ్లతో ఎదుర్కోలు నిర్వహించి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణన్ని ముత్యాల తలంబ్రాలతో వేదమంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు.అనంతరం కన్యాదానం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ఈ కమనీయ దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి,శ్రీ లక్ష్మివెంకటేశ్వర స్వామిని దర్శించున్నారు.పలువురు భక్తులు చిన్నపిల్లలకు తులాభారం నిర్వహించి తమ తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాదం వితరణ చేశారు. సాయంత్రం పూర్ణాహుతి నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి- అమ్మ వారి కళ్యాణాన్ని తిలకించి భక్తి పారవశ్యంలో మునిగితేలరు. భక్తులు తెల్లవారుజాముండే స్వామివారిని దర్శించుకున్నారు.గోవిందా నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.ఆలయాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
