దళారులను నమ్మి మోసపోవద్దు.

దళారులను నమ్మి మోసపోవద్దు.
కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : శనగ పంటను పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటా కు రూ.5,875 మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సూచించారు. బుధవారం ఆలూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శనగ మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేసి, కొనుగోలు ప్రక్రియ, తూకం, రికార్డుల నిర్వహణ, రైతుల సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్…శనగ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇప్పటి వరకు మండలంలో మొత్తం 252 మంది రైతులు శనగ అమ్మకానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు వెంటనే నమోదు చేసుకుని ప్రభుత్వ మద్దతు ధర ప్రయోజనం పొందాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.

దళారులను నమ్మి తక్కువ ధరకు పంట అమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందని రైతులకు జేసీ తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత వ్యవసాయ శాఖ లేదా కొనుగోలు కేంద్ర అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈకార్యక్రమంలో పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్, తహసిల్దార్ శోభా సువర్ణమ్మ, వ్యవసాయ అధికారి వెంకటేష్ గౌడ్, సంబంధిత శాఖాధికారులు, మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
