ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

  • ఎగ్జామ్స్ సజావుగా నిర్వహించడమే లక్ష్యం
  • పటిష్టమైన పోలీసు బందోబస్తు
  • 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు
  • 25 నుండి మార్చి 18 వరకు నిషేధాజ్ఞలు అమలు
  • వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా,సాఫీగా,ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రకటించారు. జిల్లా పరిధిల్లోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణలో భాగంగా సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 94 పరీక్ష కేంద్రాల్లో (హన్మకొండ 52, వరంగల్ 24, జనగామ 16) ఈనెల 25 నుండి మార్చి18 వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు.

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్న వేళల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల కొనసాగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ముగిసే వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడి ఉండరాదని హెచ్చరించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలపై నిషేధం అమలులో ఉంటాయన్నారు.పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు ఈనెల 25 నుండి మార్చి18 వరకు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేయాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశించారు.ఎవరైనా ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని కొత్వాల్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు.

Leave a Reply