ఆలేరు బిఆర్ఎస్ కౌన్సిలర్లకు సన్మానం

ఆలేరు, ఆంధ్రప్రభ : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సమస్యలను గాలికి వదిలేసి మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ధ్వజమెత్తారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని దొంతరి సోమిరెడ్డి గార్డెన్ లో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లను శాలువాలతో సన్మానించి అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. రాజకీయరంగంలో గెలుపు ఓటములు సహజం, ఓటమిపాలైన వారికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలలో ఆలేరు,యాదగిరిగుట్ట లలో కాంగ్రెస్ ది నిజమైన గెలుపు కాదని, అది అక్రమ మార్గంలో గెలుపొందిన గెలుపుని ఆయన మండిపడ్డారు.
ఎన్నికలు రాగానే బీహార్ తరహా సంస్కృతిని రాష్ట్రంలో అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి 420 హామీలతో అధికారంలోకి వచ్చి ఒక హామీని అమలు చేయకుండా రైతులను ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. కెసిఆర్ హయాంలో రైతులకు రైతుబంధు వరి నాట్లు వేయకముందే వారి అకౌంట్లో వేసేవారు, కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రైతులకు రెండుసార్లు రైతుబంధు ఏకనామా పెట్టారని ఆయన దుయ్య బడ్డారు. రాష్ట్రంలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు రాగానే రైతుబంధు, రైతులు రేవంత్ రెడ్డికి గుర్తుకు రావడం శోచనీయమన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆయన చెప్పారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రావడంతో రాష్ట్రము 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని తెలిపారు. ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలందరూ మళ్ళీ కారే రావాలి, మళ్లీ సారె రావాలని కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. రాబోయే రెండేళ్లలో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్,పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, ఆలేరు పిఎసిఎస్ చైర్మన్ మొగులు గాని మల్లేశం, టిఆర్ఎస్ నాయకులు ఆడెపు బాలస్వామి కొలుపుల హరినాథ్, బీజని కళ్యాణి మధు, పాకాల మౌనిక హరీష్, యాట శివకుమార్, మాజీ ఎంపీపీ కాసగళ్ల అనసూయ, యాట విజయలక్ష్మి, కర్ర అశోక్ జెల్లీ నరసింహులు, బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
