Guntur | ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి…

Guntur | ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి…
Guntur | యడ్లపాడు, ఆంధ్రప్రభ : యడ్లపాడు సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ఒకదాని కొకటి ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, చిలకలూరిపేట నుండి గుంటూరు వైపు వెళ్తున్న కారు యడ్లపాడు హైవేపైకి రాగానే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది.
అతివేగంతో ప్రయాణిస్తున్న కారు ముందుగా వెళ్తున్న ఆటోను, అనంతరం బైక్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు హైవే వంతెనపై ఉన్న రక్షణ గోడను ఢీకొట్టుకుని కింద ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తండ్రి, ఆయన పదేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఆటో, బైక్పై ప్రయాణిస్తున్న మరో ఇద్దరు కూడా గాయాలపాలయ్యారు.

స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గుంటూరు సమీపంలోని కాటూరి ఆసుపత్రి కు తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
