2600 yrs|అత్యంత ప్రాచీన గుడిమల్లం శివాలయం

2600 yrs|అత్యంత ప్రాచీన గుడిమల్లం శివాలయం
2600 yrs| గుడిమల్లం శివలింగం ప్రత్యేకత – మానవాకారంలో శివుడు
ఏకశిలపై త్రిమూర్తులు – ఋగ్వేద కాలం నాటి ఆధ్యాత్మిక సాక్ష్యం
పరశురాముని తపస్సు – ఆలయ పురాణ గాథ
గజపృష్టాకార గర్భగుడి – వాస్తు శిల్ప అద్భుతం
పల్లవులు నుంచి విజయనగర రాజుల వరకు ఆలయ చరిత్ర
స్వర్ణముఖి నది తీరంలోని అపూర్వ క్షేత్రం
గుడిమల్లం ఆలయానికి ఎలా వెళ్ళాలి?
బాపట్ల బ్యూరో ఆంధ్రప్రభ : తిరుపతికి అత్యంత సమీపంలో, స్వర్ణముఖి నది ఒడ్డున చరిత్ర పుటల్లో మరుగునపడి ఉన్న ఒక అద్భుతమైన శివాలయం. భారతదేశంలోనే తొలి శివాలయంగా చరిత్రకారులు భావిస్తున్న గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, అక్షరాలా 2,600 సంవత్సరాల భారతీయ ఆధ్యాత్మిక ప్రయాణానికి సజీవ సాక్ష్యం. తిరుపతికి 13-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్లం గ్రామంలో అత్యంత పురాతనమైన, నిరంతరాయంగా పూజలందుకుంటున్న శివలింగానికి ప్రసిద్ధి. శ్రీకాళహస్తి నియోజకవర్గం అయినప్పటికీ రేణిగుంట హైవే కు అత్యంత సమీపంలో గుడిమల్లం ఆధ్యాత్మిక క్షేత్రం విలసిల్లుతున్నది. ఈ నెల17వ తేదీ వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
2600 yrs | గుడిమల్లం శివలింగం ప్రత్యేకత

దేశంలో మరే సాధారణ శివాలయాల్లో కనిపించే లింగాల మాదిరిగా గుడిమల్లం లింగం ఉండదు. ముదురు గోధుమ రంగు రాతితో చెక్కబడిన ఈ లింగం దాదాపు ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. దీని వాస్తవిక రూపం వేదకాలం నాటి స్థానిక దైవారాధనను ప్రతిబింబిస్తుంది. ఈ లింగంపై ఒక వేటగాడి రూపంలో ఉన్న రుద్రుని (శివుని) ప్రతిమ చెక్కబడి ఉంటుంది. ఆ రుద్రుడు కుడి చేతిలో ఒక గొర్రెపిల్లను, ఎడమ చేతిలో ఒక చిన్న గొడ్డలి (పరశువు) ధరించి ఉంటాడు.ఈ రుద్రుడు ఒక అపస్మార పురుషుని (మరుగుజ్జు యక్షుడి) భుజాలపై నిలబడి ఉంటాడు. ఈ రూపం శివుడు ప్రకృతితో ఎంతగా మమేకమయ్యాడో తెలియజేస్తుంది.
ఈ రూపంలో శివునికి యజ్ఞోపవీతం (జంధ్యం) లేకపోవడం చరిత్రకారులను ఆశ్చర్యపరుస్తుంది. శివుడు నిరాకారుడు. పూజలందుకోవటానికి శివలింగం రూపంలో ఆలయం లో కొలువుతిరి ఉన్నాడు. కేవలం గుడిమల్లం ఆలయంలో మాత్రమే మానవాకారంలో శివలింగం గర్భగుడిలో భక్తులచే పూజలు అందుకుంటుంది. లింగపు అగ్ర భాగము, మరియు కింద పొడవైన స్తంభ భాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పళ్ళము పడిన గీత స్పష్టంగా ఉండి, మొత్తము లింగము పురుషాంగమును పోలి ఉంది. అతి ప్రాచీనమైన శైవారాధన లింగముగా చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ఆర్యుల రాకకు పూర్వపు సంప్రదాయాలను, క్రీ.పూ. 2 లేదా 3వ శతాబ్దం నాటి కాలాన్ని ప్రతిబింబిస్తుందని పురావస్తు శాఖ అంచనా వేసింది.
ఆలయ పురాణ గాథ

ఈ ఆలయాన్ని పరశురామేశ్వరాలయం అని పిలవడానికి ఒక పురాణ గాథ ఉంది. తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవి శిరస్సు ఖండించిన పరశురాముడు, బ్రహ్మహత్యా పాతకానికి గురవుతాడు. పాప పరిహారం కోసం స్వర్ణముఖి నది తీరానికి వచ్చి, ఇక్కడ ఒక మేడి చెట్టు కింద ఉన్న పుట్టలో ఈ అద్భుత శివలింగాన్ని కనుగొని ఘోర తపస్సు చేశాడు. పరశురాముని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై, అతనికి పాపవిమోచనం కలిగించాడని స్థల పురాణం చెబుతోంది. 1991 లో గోపీనాథరావు అనే పురాతత్వ శాస్త్రవేత్త ఈ శివాలయం పై సంవత్సర కాలం పాటు అనేక పరిశోధనలు చేసి ఈ దేవాలయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఉత్తర ప్రదేశ్ లోని మధుర లో ఉన్న మ్యూజియంలో క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దానికి చెందినది అంటూ ఒక లింగాన్ని భద్రపరిచారు.
అది గుడిమల్లం శివలింగాన్ని పోలి ఉంది అని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన మరికొంత సమాచారం చంద్రగిరి కోటలోని మ్యూజియంలో లభ్యమవుతుందని తెలియజేస్తున్నారు. ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయంగా పేర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న శాసనాలను బట్టి భారతదేశంలోనే అతి ప్రాచీనమైన శివాలయం గా చరిత్రకారులు గుడిమల్లం శివాలయాన్ని చెబుతున్నారు.
2600 సంవత్సరముల నాటి అతి ప్రాచీన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆలయము నందు ఏకశిలపై త్రిమూర్తులు బ్రహ్మ అక్షరూపం విష్ణువు పరశురామ అవతారం శివుడు పురుష లింగాకారంతో స్వర్ణముఖి నదీ తీరమున వెలసి ఉండుట ఇక్కడి విశేషం గర్భాలయ నిర్మాణం శివలింగాకృతిలోనూ గోపురం గజపుష్టి ఆకారంలో ఉంటుంది 2005 డిసెంబర్ 4వ తేదీన స్వర్ణముఖి నది జలం స్వామివారిని అభిషేకించినదని ఉత్తరాయణం నుండి దక్షిణాయనకి మారే దిశలో సూర్యకిరణాలు మూలవిరాట్ను తాకుతాయని ఆలయ అర్చకులు తెలియజేస్తున్నారు. 60 సంవత్సరములకు ఒక సారి స్వర్ణముఖి తీర్థము స్వామివారిని తాకుతుందని తెలిపారు
కాల యంత్రం తలపించేలా వాస్తు శిల్ప అద్భుతం
ఈ ఆలయ గర్భగుడి గజపృష్ఠాకారంలో (ఏనుగు వెనుక భాగం ఆకారం) ఉండటం దీని ప్రత్యేకత. పల్లవులు, చోళులు, బాణ రాజులు, విజయనగర రాజుల పాలనలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. ఆలయంలోని శాసనాలు దీనికి నిదర్శనం.గుడిమల్లం కేవలం ఒక దేవాలయం కాదు, అదొక కాల యంత్రం లాంటిది. ఇక్కడికి అడుగుపెట్టగానే మనం వేల సంవత్సరాల వెనక్కి ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. భారతీయ సంస్కృతి, శిల్పకళ మరియు ఆధ్యాత్మికత యొక్క ఈ అపురూప సంగమాన్ని చూసిన అనుభూతి దక్కుతుంది. ఈ దేవాలయంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, శ్రీ సూర్య భగవానుడి దేవాలయం, శ్రీ పార్వతి దేవి దేవాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఎలా వెళ్ళాలి
చిత్తూరు జిల్లాలోని రేణిగుంటకు 11 కిలోమీటర్ల దూరంలో గుడిమల్లం పరశురామేశ్వరాలయం ఉంది. తిరుపతి నుంచి 22 కిలోమీటర్లు ఉంటుంది. తిరుపతి, చిత్తూరు, రేణిగుంట నుండి బస్సు సౌకర్యం ఉంది. ఆటోలు, కారులు, జీపులు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం సమయంలో దేవాలయంలో ఉచిత అన్న ప్రసాద వితరణ జరుగుతుంది.
–పల్లపోలు మురళి కృష్ణ,
ఆంధ్రప్రభ బ్యూరో , బాపట్ల జిల్లా
2600 సంవత్సరముల నాటి అతి ప్రాచీన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆలయము నందు ఏకశిలపై త్రిమూర్తులు బ్రహ్మ అక్షరూపం విష్ణువు పరశురామ అవతారం శివుడు పురుష లింగాకారంతో స్వర్ణముఖి నదీ తీరమున వెలసి ఉండుట ఇక్కడి విశేషం గర్భాలయ నిర్మాణం శివలింగాకృతిలోనూ గోపురం గజపుష్టి ఆకారంలో ఉంటుంది 2005 డిసెంబర్ 4వ తేదీన స్వర్ణముఖి నది జలం స్వామివారిని అభిషేకించినదని ఉత్తరాయణం నుండి దక్షిణాయనకి మారే దిశలో సూర్యకిరణాలు మూలవిరాట్ను తాకుతాయని ఆలయ అర్చకులు తెలియజేస్తున్నారు. 60 సంవత్సరములకు ఒక సారి స్వర్ణముఖి తీర్థము స్వామివారిని తాకుతుందని తెలిపారు
click here to read 108lingas | ఆంధ్ర సరిహద్దులో ఆధ్యాత్మిక అద్భుతం
