మక్తల్ లో బాయికాటి కుటుంబానికి తగ్గని ఆదరణ

మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో బాయికాటి కుటుంబానికి రాజకీయంగా ఆదరణ తగ్గడం లేదు. దశాబ్దాలుగా ఆ కుటుంబం ప్రజాసేవలో కొనసాగుతోంది. ఈ నెలలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో బాయికాటి కుటుంబం నుండి బిజెపి పార్టీ ద్వారా మేనమామ రాజశేఖర్ రెడ్డి ,మేనకోడలు శైవి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండిఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్లుగా గెలుపొందారు. అంతేకాకుండా మేనకోడలు శైవిరెడ్డి అనూహ్యంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఎన్నిక కావడం విశేషం. ఈ కుటుంబ నేపథ్యాన్ని ఒకసారి గమనిస్తే పెద్ద వ్యవసాయ కుటుంబం కావడంతో వారి కుటుంబానికి రాజకీయాల్లో అరంగేట్రం చేయకముందు నుండి ఆదరణ ఉంది. అప్పటికి కూడా ఈ కుటుంబం పట్టణంలో పెద్దరికం (పెత్తనం )కొనసాగించేది.
ప్రత్యక్ష రాజకీయాలతో మరింత ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లో అడుగిడిన తర్వాత ఆ కుటుంబానికి వెనకకు చూసుకునే పని లేకుండా ప్రజలు సహకరిస్తూ వస్తున్నారు. దీంతో ప్రజాసేవలో ఆ కుటుంబం చెరగని ముద్ర వేసుకుందని చెప్పవచ్చు. ఈ నెలలోనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మేనమామ మేనకోడలు ఇద్దరు ఒకేసారి మున్సిపల్ కౌన్సిలర్ గా వేరువేరు పార్టీల నుండి ఎంపిక కావడం విశేషం. ఇద్దరూ మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలవడమే కాకుండా అతి చిన్న వయసులో మొదటిసారి రాజకీయాల్లో అడుగుపెట్టి విజయం సాధించిన మేనకోడలికి మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ గా అవకాశం దొరకడం మరో విశేషంగా చెప్పవచ్చు.బాయికాటి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని చెప్పవచ్చు.
ఒకసారి ఆ కుటుంబాన్ని గమనిస్తే 1988 సంవత్సరంలో మక్తల్ మెజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా బాయికాటి ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు.అతని తమ్ముడు అదే సంవత్సరంలో బాయికాటి సురేందర్ రెడ్డి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 1995 సంవత్సరంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రబాకర్ రెడ్డి కూతురు స్వతంత్ర బాయికాటి సృజన స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు.1996 సంవత్సరంలో ప్రబాకర్ రెడ్డి సోదరుడు బాయికాటి సూర్య జనేశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి పిఎసిఎస్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు.ఆ తర్వాత 2006 సంవత్సరంలో ప్రభాకర్ రెడ్డి అల్లుడు బాయికాటి మధుసూదన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి ఎంపీటీసీగా ఎన్నికయ్యారు.అనంతరం 2014 సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ కుటుంబం నుండి మరోసారి సురేందర్ రెడ్డి సతీమణి బాయికాటి మంజుల తెలుగుదేశం పార్టీ నుండి ఎంపిటిసిగా ఎన్నికయ్యారు.
మేజర్ గ్రామపంచాయతీ నుండి మక్తల్ మున్సిపాలిటీ గా మారిన తర్వాత 2019 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి నుండి 2వ వార్డు నుండి పోటీచేసిన బాయకాటి అఖిల రాజశేఖర్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికై మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా పనిచేశారు.తాజాగా 2026 మున్సిపల్ 2వ సాదారణ ఎన్నికల్లో మొదటి సారి వైస్ చైర్పర్సన్ గా పనిచేసిన అఖిల రాజశేఖర్ రెడ్డి భర్త బాయికాటి రాజశేఖర్ రెడ్డి 1 వార్డు బిజెపి నుండి కౌన్సిలర్ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని ఓడించి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి మేనకోడలు బాయికాటి శైవి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి 9వ వార్డు అభ్యర్థి గా పోటీ చేసి మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొందడం జరిగింది.
అంతేనా అనుకుంటే అనూహ్యంగా శైవి రెడ్డి ఉన్నత విద్యావంతురాలైనందుకు స్థానిక మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆశీస్సులతో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. రిజర్వేషన్ల కారణంగా అనుకోకుండా తండ్రి వారసురాలిగా 9వ వార్డు నుండి మున్సిపల్ కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శైవిరెడ్డి తొలిప్రయత్నంలోనే విజయం సాధించడమే కాకుండా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఎంపిక కావడం విశేషం.ఈ సంఘటనను బాయికాటి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదర్శనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఈ సందర్భంగా మేనమామ రాజశేఖర్ రెడ్డి ,మేనకోడలు శైవి రెడ్డి ఆంధ్రప్రభ తో మాట్లాడుతూ పరిస్థితుల దృష్ట తమ కుటుంబం వేరు వేరు పార్టీలో ఉన్నప్పటికీ ఆయా పార్టీల నాయకత్వం కానీ ప్రజలు కానీ మాపై చూపిన అభిమానానికి వెలకట్టలేమని అభిప్రాయపడ్డారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమ శక్తికి మించి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందుతామని పేర్కొన్నారు. తమ కుటుంబం పట్ల పట్టణ ప్రజలు చూపుతున్న ఆదరణకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
