Muncipal | క్ష‌ణ‌క్ష‌ణం.. ఉత్కంఠ

Muncipal | క్ష‌ణ‌క్ష‌ణం.. ఉత్కంఠ

మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ 144 సెక్షన్ అమలు
భారీగా మోహరించిన పోలీసులు

Muncipal | ఆంధ్ర‌ప్ర‌భ, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా పరిధిలోని తొర్రూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితుల దృష్ట్యా పట్టణంలో 144 సెక్షన్‌ను కఠినంగా అమలు చేస్తూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో పోలీసులు మోహరించగా, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 9, కాంగ్రెస్‌కు 7 మంది కౌన్సిలర్లు గెలవడంతో మొదలైన రాజకీయ సమీకరణాలు ఇటీవల మరింత ఉత్కంఠను రేకెత్తించాయి. అనంతరం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓట్లతో ఇరుపార్టీల బలం 9-9కు సమానమవడంతో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.

ఇరుపార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు ఈరోజుకు వాయిదా వేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పూర్తిస్థాయిలో పట్టణాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ముఖ్య ప్రదేశాల్లో పికెటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అనవసర గుంపులు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇంతటి ఉద్రిక్త వాతావరణం మధ్య ఎన్నికల ప్రక్రియ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి మొత్తం తొర్రూరు వైపే నిలిచింది. ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా పూర్తవుతుందా? లేక మరింత రాజకీయ ఉత్కంఠకు దారి తీస్తుందా? అన్నది చూడాలి.

Leave a Reply