ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉత్కంఠ

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉత్కంఠ
పూర్తయిన కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం
సస్పెన్స్ లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక !
ఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 16(ఆంధ్రప్రభ) : మున్సిపల్ నూతన కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఇవాళ ఉండటంతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కే.అనంతరెడ్డి ఆధ్వర్యంలో సమావేశ మందిరాన్ని మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. సమావేశ మందిరానికి బీఆర్ఎస్ ఒకరు ఆకుల యాదగిరి మినహా, బీఆర్ఎస్-12, కాంగ్రెస్-8, బీజేపీ-2, ఇండిపెండెంట్-1, ఎమ్మెల్యే(ఎక్స్ అఫిషియో) మల్ రెడ్డి రంగారెడ్డి చేరుకున్నారు.
అదేవిధంగా బీఆర్ఎస్ క్యాంపుకు వెళ్ళిన ఆకుల యాదగిరి మిస్సింగ్ లో ఉండటంతో అతని భార్య, కుమారుడు మున్సిపాలిటీ కార్యాలయంలోని సమావేశ మందిరంలోకి చేరుకుని ఆందోళనకు దిగారు. తన భర్త వచ్చేంతవరకు చైర్మన్ ఎన్నికను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గెలిచిన 24 మందిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి సరైన కోరం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఒక వ్యక్తి హాజరు కాకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ఆర్డిఓ వాయిదా వేస్తారా ? లేక నూతన పాలక వర్గం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఏర్పడుతుందా? అనేది మరి కొద్ది నిమిషాల్లో తేలనుంది.
