నిజామాబాద్ ప్రతినిధి, మార్చి12 (ఆంధ్రప్రభ) : ఆడబిడ్డల నుంచి మొదలుకొని.. రైతులు.. నిరుద్యోగులు.. యువత.. అందరికీ కల్లబొల్లి మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని మరచి అభివృద్ధి చేయలేని కాంగ్రెస్.. అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు పలికించడం దారుణమన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ఇవాళ ఎమ్మెల్యే ధన్ పాల్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి.. అన్న అబ్దుల్ కలామ్ మాటలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మొద్దు నిద్రలో ఉంటూ కలలు కనండి, కానీ మెలకువలో ఉండొద్దు అనేలా పాలన సాగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు ప్రస్థావించేలా చేయడం ఖండించదగిన చర్య అన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.