AP | మహిళాభ్యున్నతే టీడీపీ లక్ష్యం – లింగ వివక్ష లేని సమానత్వం సాధిద్దాం – చంద్రబాబు

ఆస్తిలో సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆర్
అమ్మ చెల్లి ఆస్తికి ఎసరుపెట్టిన వ్యక్తి పాలించాడు
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు విమ‌ర్శలు
ఏపీ నుంచి ఎంద‌రో మ‌హిళ‌లు రాణించార‌న్న సీఎం

వెల‌గ‌పూడి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహిళా సాధికారిత కోసం నిన్న, నేడు, రేపు టీడీపీ పనిచేస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు . తెలుగుదేశం పార్టీ సిద్దాంతం జండర్ ఈక్వాల‌టీ ద్వారా ఆడవారికి సమాన అవకాశాలు కల్పించడమని తెలిపారు. శాసనసభలో మహిళా సాధికారితపై బుధవారం మాట్లాడుతూ.. ఓవైపు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సమయంలోనే మహిళలపై వివక్ష చూపడం జరుగుతోందన్నారు. టీడీపీ పెట్టినప్పటి నుంచి మహిళ సాధికారిత కోసం ఎన్టీఆర్ కృషి చేశారని గుర్తుచేశారు. మహిళా సాధికారిత ప్రారంభం అయ్యింది టీడీపీతోనే అని చెప్పుకొచ్చారు. 1986లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు ఇచ్చారన్నారు. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకూ ఇదే సభలో ముఖ్యమంత్రిగా ఉన్నారని మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి సీఎం విమర్శలు గుప్పించారు. ఇచ్చిన ఆస్తి విషయంలోనూ కోర్టుకు వెళ్లి వెనక్కి ఇవ్వాలని అడిగారంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇది సజీవ సాక్ష్యం..

మహిళా విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చామన్నారు. 1995లో మహిళా ఎంపవర్‌మెంట్ కోసం ఆలోచిస్తూ డ్వాక్రా ఉమెన్ ద్వారా ఎంపవర్ చేయాలని నిర్ణయించామన్నారు. విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని తెలిపారు. దీని వల్ల ఆడబిడ్డలు చదువుకున్నారని… వారు కూడా పనిచేయడం ప్రారంభించారన్నారు. సూర్యకుమారి ఐఏఎస్… ఆమె 1996 లో గ్రూప్ వన్ ఆఫీసర్‌గా సెలెక్ట్ అయ్యి ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖా సెక్రెటరీగా పనిచేస్తున్నారన్నారు. ఆరోజు బెనిఫిషరీ ఈరోజు వారి కోసం పాలసీలు రూపొందిస్తున్నారని.. ఇది సజీవ సాక్ష్యమని చెప్పుకొచ్చారు. పుట్టిన అమ్మాయి భారం కాదు ఇంటికి మహలక్ష్మి అన్నామని… వారి పేరుతో ఓ 5వేలు డిపాజిట్ చేయించామని తెలిపారు. మగపిల్లలు, ఆడపిల్లలకు తేడాలేదని ఆడపిల్లలకు సైకిళ్లు కొనిచ్చినట్లు చెప్పారు.

మహిళ కండక్టర్‌లు.. శభాష్..

స్పీకర్‌గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చామన్నారు. 8 శాతంతో ప్రారంభమైన రాజకీయ రిజర్వేషన్లు స్ధానిక సంస్ధలలో 33 శాతం అయ్యిందన్నారు. ఆడవాళ్లు మగవాళ్ళకంటే తెలివైన వారని.. ఈ విషయం చాట్ జీపీటీని అడిగినా చెపుతుందన్నారు. అమెరికా లాంటి దేశంలో కూడా మహిళల్లో సమానత్వం లేదన్నారు. ఆర్టీసీలో ఆడ కండెక్టర్‌లు చాలా బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. 65 లక్షల గ్యాస్ కనెక్షన్‌లు ఆడబిడ్డలకు ఇప్పించామన్నారు. దీపం 2 కింద మూడు సిలెండర్‌లు ఇస్తున్నామని.. డ్వాక్రా సంఘాలు లేని ఊరూ లేదు, ఇల్లు లేదన్నారు. 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని మహిళల అండ ఉందనే ప్రకటించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *