BRS Party ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌

హైదరాబాద్ – బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌ పేరు ఖరారైంది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం దాసోజు శ్రవణ్‌ నామినేషన్‌ వేయనున్నారు. నామినేషన్‌ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఆదేశించారు..

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆయా స్థానాలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. నామినేషన్ల విత్‌డ్రాకు 13 వరకు అవకాశం ఉంది. 20న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా మూడు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్‌ఎస్‌కు వస్తాయి. ఐదో స్థానం కోసం కాంగ్రెస్‌కు ఎంఐఎంతో పాటు మరికొన్ని ఓట్లు అవసరమవుతాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. విజయశాంతి, అద్దంకి దయాకర్‌, శంకర్‌ నాయక్‌లను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. మరో ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి కాంగ్రెస్‌ కేటాయించింది. ఆ స్థానానికి చాడ వెంకటరెడ్డి నామినేషన్ వేసే అవకాశాలున్నాయి.

Leave a Reply