AP | నమ్మించి మోసం – కూటమి ప్రభుత్వంపై దేవినేని ఫైర్

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : అధికారం కోసం ఇష్టా రీతిన హామీలు ఇచ్చి, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి నమ్మించి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ వారి జీవితాలతో చలగాటమాడుతున్నారని విమర్శించారు.

జగన్ హయాంలోనే ఉన్నత విద్య, విద్యా పథకాలు పక్కాగా అమలు అయ్యాయన్న ఆయన తక్షణమే ఫీజులు రియంబర్స్మెంట్ నిధులు విడిచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 12వ తేదీన ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలోని గుణదల లో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం పలు నియోజకవర్గ ఇన్చార్జీలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన ఫీజు పోరు పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ విద్యార్థులకు అండగా ఉండాలని ఫీజు పోరు యువత పోరు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్ధుల జీవితాలను కూటమి ప్రభుత్వం నాశనం చేసిందన్న ఆయన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. జగన్ తెచ్చిన పథకాలు అమలు చేసి ప్రజలకు మంచి చేయాలని డిమాండ్ చేసారు.

రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించే విధంగా గ్రామం పట్టణం పల్లె వీధివాడ అని తేడా లేకుండా అన్ని ప్రాంతాలలో ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ వైఎస్ఆర్, జగన్ హయంలో పేద ప్రజలు ధీమాగా ఉండేవారని, చదువు విషయంలో ఎప్పుడు బెంగ పడేవారు కాదన్నారు. జగన్ మంచి చేస్తారనే నమ్మకం వారిలో ఉండేదన్నారు. విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చిన కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. తప్పులు బయటపడతాయని వైసిపి కి ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదన్నారు. అన్ని వర్గాలను మోసం చేస్తూ తప్పు మీద తప్పు చేస్తున్న కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

జగ్గయ్యపేట నియోజకవర్గం ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ నిత్యం ప్రజల పక్షానే ఉంటూ కూటమి ప్రభుత్వం కి వ్యతిరేకంగా ఉద్యమ బాట కొనసాగిస్తాం అన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్న పథకాలు అమలు చేయడం లేదన్న అయన కూటమి నేతలు చేతకాక విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్గౌతం రెడ్డి మాట్లాడుతూ విద్య వ్యవస్థను కూటమి ప్రభుత్వం నాశనం చేసిందన్న ఆయన, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కుప్ప కుళాయన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గం సీనియర్ నేత షేక్ ఆసిఫ్, పోతీన మహేష్,రవిచంద్ర ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *