Ramakrishna Mission | యువతలో మార్పునకు..

Ramakrishna Mission | యువతలో మార్పునకు..
- విజయవాడ గాంధీనగర్ లో ఫిబ్రవరి 1న ప్రారంభోత్సవం..
- రామకృష్ణ మిషన్ సర్వాధ్యక్షులు గౌతమానందజీ మహరాజ్ చేతుల మీదుగా ఆవిష్కరణ..
- ముఖ్య అతిథిగా రానున్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
- సన్నాహక ఏర్పాట్లపై ప్రెస్ మీట్ నిర్వహించిన విజయవాడ రామకృష్ణ మిషన్..
- హైదరాబాద్ రామకృష్ణ మఠం తరహాలో యువతకు శిక్షణ,మార్గదర్శనం..
- యూపిఎస్సి సర్వీసులు, ధ్యానం, యోగా, వ్యక్తిత్వ వికాసం వంటి నైపుణ్యాలపైనా శిక్షణ..
- స్వామి అద్భుతానంద మహరాజ్ జయంతి సందర్భంగా ప్రారంభం విజయవాడ రామకృష్ణ మిషన్..
Ramakrishna Mission | ఆంధ్రప్రభ, విజయవాడ : నిస్వార్థ సేవతో దేశవ్యాప్తంగా మంచి గౌరవం పొందిన ‘రామకృష్ణ మిషన్’ మరో బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ గాంధీనగర్ లోని శైలజా థియేటర్ ఎదురుగా.. నూతనంగా నిర్మించిన వివేకానంద మానవ వికాస కేంద్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రామకృష్ణ మిషన్ బేలూర్ మఠం వారి అనుబంధ శాఖగా విజయవాడలో 25 ఏళ్లు పూర్తి చేసుకుని విజయవాడ రామకృష్ణ మిషన్ రజతోత్సవ వేడుకలను జరుపుకుంటోంది.
ఈ శుభసందర్భంలో మాఘపౌర్ణమితో పాటు స్వామి అద్భుతానంద మహరాజ్ జయంతి కావడంతో ఆ పవిత్రమైన రోజున శ్రీమత్ స్వామి గౌతమానందజీ మహరాజ్ చేతుల మీదుగా వివేకానంద హ్యుమన్ ఎక్సలెన్స్ సెంటర్ ప్రారంభిస్తున్నట్లు విజయవాడ రామకృష్ణ మిషన్ ప్రకటనలో పేర్కొంది. ఈ విశిష్ఠ కార్యక్రమానికి భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరవుతున్నట్లు వెల్లడించింది.
2047 వికసిత భారత్ లక్ష్యంలో రామకృష్ణ మిషన్ భాగస్వామ్యం : శితికంఠ స్వామీజి
ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 9గం.లకు నూతన భవన ప్రారంభోత్సవం జరగనుందని విజయవాడ రామకృష్ణ మిషన్ సహాయకార్యదర్శి శితికంఠ స్వామీజి వెల్లడించారు. భారత ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో మానసిక ఆరోగ్యం, ‘డిజిటల్’ వ్యసనాలపై సమాజం అప్రమత్తమవ్వాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించుకున్న 2047 వికసిత భారత్ లక్ష్యాల సాకారంలో కీలకమైన ఉపాధి అవకాశాల పెంపులో రామకృష్ణమిషన్ సైతం తన వంతు భాగస్వామ్యమవుతుందని శితికంఠస్వామీజీ వివరించారు. దేశంలో ఎన్నో శిక్షణా కేంద్రాలున్నప్పటికీ సివిల్ సర్వీసులలో కీలకమైన విలువలు, నైతికత వంటి అంశాలలో ఈ ట్రైనింగ్ కేంద్రం ప్రత్యేక శిక్షణనిస్తుందన్నారు.
ఆసక్తి కలిగిన యువతీయువకులు ధ్యానం, యోగా, వ్యక్తిత్వ వికాసం, మనోనిగ్రహం, భావప్రకటన నైపుణ్యాలపైనా శిక్షణ, ఆధ్యాత్మిక ప్రవచనాలు, అంతర్యోగం అలవరచుకోవచ్చన్నారు. బాల సంస్కార కేంద్రం ద్వారా ఆసక్తి కలిగిన వారికి గాత్రం, వాయిద్యాలు, యోగ, నృత్యం, విలువలు, నైతిక బోధ, భక్తిగీతాలను నేర్పనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో 20 ఏళ్ల క్రితం ఏర్పాటైన హ్యుమన్ ఎక్సలెన్స్ సెంటర్ ద్వారా 18 లక్షల మందికి పైగా శిక్షణ పొందినట్లు స్వామిజీ తెలిపారు.
వివేకానంద మానవ వికాస కేంద్రంలోని ప్రత్యేకతలు:
ఆరు అంతస్తుల భవనంలో ప్రతి అంతస్తును ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం కేటాయించారు మొదటి అంతస్తులో పాఠకులకు జ్ఞానాన్ని అందించే బుక్ స్టాల్, పరిపాలనా వ్యవహారాల కోసం కార్యాలయం, సందర్శకుల కోసం గెస్ట్ రూమ్ , ఆధునిక కేఫ్టీరియా ఏర్పాటు చేశారు. రెండవ అంతస్తు లో భక్తుల కోసం ప్రశాంతమైన దేవాలయం, పూజా కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఫ్రూట్ కటింగ్ రూమ్ , సౌకర్యవంతమైన వాష్‌రూమ్స్ నిర్మించారు. మూడవ అంతస్తులో విద్యార్థుల కోసం 4 విశాలమైన తరగతి గదులను సిద్ధం చేశారు. నాలుగవ అంతస్తు లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అదనంగా 2 తరగతి గదులను ఏర్పాటు చేశారు. ఐదవ అంతస్తు లో అతిథుల కోసం 2 గెస్ట్ రూమ్స్, ఒక తరగతి గది, భారీ డైనింగ్ హాల్, వంటశాల, మరో కేఫ్టీరియా ఉన్నాయి.
రూ.8.5 కోట్లతో నిర్మించిన భవనలో యువతకు శిక్షణ : స్వామి వినిశ్చిలానంద మహరాజ్
అనంతరం విజయవాడ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి వినిశ్చిలానంద మహరాజ్ మీడియాతో మాట్లాడుతూ..రామకృష్ణ మిషన్ విద్య, వైద్య రంగాల్లో విశిష్ట సేవలందిస్తోందని వెల్లడించారు. రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ లో రూ.8.5 కోట్లతో నిర్మించిన భవన నిర్మాణం ఎంతో మంది యువతీయువకులకు మార్గనిర్దేశం చేయనుందన్నారు. ఈ భవని నిర్మాణంలో ఏర్పాటు చేసిన పుస్తక విక్రయశాల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఈ భవనం, శిక్షణపై అవగాహన కల్పించేందుకు మీడియా కృషి చేయాలని కోరారు.
ఫిబ్రవరి 1న నిర్వహించే కార్యక్రమాల వివరాలు
ఉదయం 9గం.లకు వివేకానంద మానవ వికాస భవన ప్రారంభోత్సవం జరుగుతుంది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం ఉదయం 10గం.లకు జ్యోతి ప్రజ్వలన, మూర్తి త్రయానికి పుష్పాంజలి, వేదమంత్ర పఠనం, ప్రారంభగీతంతో మొదలవుతుందన్నారు. అనంతరం సమావేశ కార్యక్రమాలన్నీ తుమ్మలపల్లి కళాక్షేత్రములో నిర్వహించనున్నట్లు స్వామీజీలు తెలిపారు. అనంతరం పరమపూజ్య శ్రీమత్ స్వామి గౌతమానందజీ మహరాజ్ అనుగ్రహ భాషణం, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందేశం, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ప్రసంగం, పూజ్య స్వామి వినిశ్చిలానంద, స్వామి శశికాంతనంద, స్వామి హృదానంద, స్వామి శితికంఠానంద ప్రసంగాలతో కార్యక్రమం జరగనుందన్నారు.
యువతకోస ప్రత్యేకంగా ‘యువసమ్మేళనం’
మధ్యాహ్నం 2గం.లకు ‘యువసమ్మేళనం’లో పాల్గొనే అవకాశాన్ని యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని రామకృష్ణ మిషన్ వెల్లడించింది. ఉపాధ్యాయులకు శిక్షణకు సంబంధించిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. వివేకానంద యువసమ్మేళనంలో హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద, కర్ణాటక గదగ్ రామకృష్ణ వివేకానంద ఆశ్రమ అధ్యక్షులు స్వామి నిర్భయానంద, కర్ణాటక తుంకూరు రామకృష్ణ వివేకానంద ఆశ్రమ అధ్యక్షులు స్వామి వీరేశానంద, కడప రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి అనుపమానంద ప్రసంగం, యువత ప్రశ్నలు- జవాబుల కార్యక్రమం ఉంటుందన్నారు.
సాయంత్రం 4.45 గం.లకు ప్రారంభమయ్యే స్వామి రంగనాథానంద స్మృతి సభలో విజయవాడ రామకృష్ణ మిషన్ పాఠశాల విద్యార్థులచే భజనలు, లఘునాటిక ప్రదర్శనలు, శాస్త్రీయ నృత్యం, కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు. శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.చదలవాడ సుధ, డా.చదలవాడ నాగేశ్వరరావు ప్రసంగం, ఢిల్లీ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సర్వలోకానందజీ, చెన్నై రామకృష్ణ మఠం మేనేజర్ స్వామి రఘునాయకానంద ప్రసంగాలు ఉంటాయన్నారు. ఈ సన్నాహక ప్రెస్ మీట్ కార్యక్రమంలో జ్ఞానార్కనంద స్వామీజీ , రామకృష్ణ మిషన్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు సుధాకర్ పాల్గొన్నారు.
