MLA | రేపటి నుంచే మున్సిపల్ ‘నామినేషన్ల’ జాతర!

MLA | రేపటి నుంచే మున్సిపల్ ‘నామినేషన్ల’ జాతర!

  • బెల్లంపల్లిలో మున్సిపల్ పోరుకు లీడర్ల సిద్ధం
  • 34 వార్డులు.. 44,575 మంది ఓటర్లు..
  • కాంగ్రెస్ టికెట్ కోసం ‘క్యూ’.. ఎమ్మెల్యే వినోద్ వ్యూహాలపై ఉత్కంఠ

MLA | బెల్లంపల్లి ఆంధ్రప్రభ : ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. బుధవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో బెల్లంపల్లి పట్టణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ పోరులో మొత్తం 34 వార్డుల భవితవ్యం తేలనుంది. నియోజకవర్గ కేంద్రంలోని 44,575 మంది ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. వీరిలో 23,012 మంది మహిళా ఓటర్లు, 21,560 మంది పురుష ఓటర్లు ఉండగా, మరో ముగ్గురు ఇతరులు (ట్రాన్స్‌జెండర్స్) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

పురుషుల కంటే మహిళా ఓటర్లే సుమారు 1,452 మంది అధికంగా ఉండటం గమనార్హం. టికెట్ల కోసం క్యూ.. ఎమ్మెల్యే వినోద్ మంతనాలు: అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు భారీగా తరలివస్తున్నారు. ఒక్కో వార్డు నుంచి నలుగురు ఐదుగురు అభ్యర్థులు రేసులో ఉండటంతో టికెట్ల ఎంపిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామికి సవాలుగా మారింది.

ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు గుర్రం అవుతుందనే దానిపై ఆయన సీనియర్లతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. నామినేషన్ల సమయం ఆసన్నమవడంతో ఎమ్మెల్యే కన్ఫామ్ చేసే పేర్ల కోసం అభ్యర్థులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

బీఆర్ఎస్ ‘రివర్స్’ ప్లాన్… దుర్గం చిన్నయ్య జోష్*: బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కేంద్రంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇప్పటికే ఎన్నికల సమరశంఖం పూరించారు. కాంగ్రెస్ ‘బాకీ కార్డు’ను ప్రజల్లో ఎండగడుతూ.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. 34 వార్డుల్లోనూ గులాబీ జెండా ఎగురవేసి, చైర్మన్ పీఠాన్ని కేసీఆర్, కేటీఆర్‌లకు కానుకగా ఇవ్వాలనే లక్ష్యంతో శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

ముక్కోణపు పోటీలో గెలుపెవరిది? మరోవైపు బీజేపీ కూడా పట్టణ ఓటర్లపై కన్నేసింది. కేంద్ర పథకాలను ప్రచారం చేస్తూ నిశ్శబ్దంగా పావులు కదుపుతోంది. మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో, వారిని ఆకర్షించే పార్టీకే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి (బుధవారం) నుంచి నామినేషన్లు మొదలవుతుండటంతో, పట్టణంలో ప్రచార హోరు, జెండాల పండగ మొదలుకానుంది. బెల్లంపల్లి మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉండగా, మొత్తం ఓటర్ల సంఖ్య 44,575. ఇందులో మహిళా ఓటర్లు 23,012 మంది, పురుష ఓటర్లు 21,560 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు.

Leave a Reply