Temple | రాజశ్యామల పీఠంలో 9 రోజుల నవరాత్రి మహోత్సవం

Temple | రాజశ్యామల పీఠంలో 9 రోజుల నవరాత్రి మహోత్సవం
Temple | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహాదేవ్ శక్తి సంస్థాన్ నిర్వహణలో, శివరాజయోగి కృష్ణస్వామీజీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలోని రాజశ్యామల పీఠంలో మరకత రాజశ్యామల అమ్మవారు కొలువై ఉన్న విశిష్ట ఆధ్యాత్మిక క్షేత్రంలో శ్యామల నవరాత్రి మహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి రోజు ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజా విధానాలతో అమ్మవారి రూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారి సాన్నిధ్యం భక్తుల్లో విశ్వాసం, ధైర్యం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించింది. నవరాత్రుల కాలంలో నిర్వహించిన కుబేర కుంకుమతో కోటి కుంకుమార్చన కార్యక్రమంలో 45 నుంచి 50 వేల మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లోని వివిధ జిల్లాల నుంచి పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

అమ్మవారి కృపతో అనేక మంది భక్తులు తమ జీవితాల్లో శాంతి లభించిందని, మనసుకు ఊరట కలిగిందని తెలిపారు. వేలాది మంది భక్తులు అమ్మవారి సాన్నిధ్యంలో లీలానుభూతులను అనుభవించి ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందారని నిర్వాహకులు తెలిపారు. అలాగే నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన రాజశ్యామల యాగం మరియు హోమాది కార్యక్రమాలు పీఠానికి ప్రత్యేక మహిమాన్వితతను తీసుకొచ్చాయి. యాగాగ్ని సమక్షంలో జరిగిన పూజలు భక్తులకు విశేష అనుభూతిని కలిగించాయి.
ట్రస్ట్ నిర్వాహకులు సేవా కార్యక్రమాలకు విశేష ప్రాధాన్యం ఇవ్వగా, ఈ తొమ్మిది రోజులలో సుమారు 60 వేల మందికి అన్నదానం నిర్వహించడం మరో విశేషంగా నిలిచింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాజశ్యామల పీఠాన్ని దర్శించి “ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రం మరెక్కడా కనిపించదు” అంటూ తమ అనుభూతులను వ్యక్తం చేశారు.
ఈ తొమ్మిది రోజుల శ్యామల నవరాత్రి మహోత్సవానికి ముగింపుగా జనవరి 28న పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. పూర్ణాహుతితో యాగానికి సంపూర్ణత చేకూర్చి, మరకత రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులతో నవరాత్రి ఉత్సవాలను మహా మంగళంగా ముగించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పూర్ణాహుతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
