AP | కదిరిలో దారుణం

AP | కదిరిలో దారుణం

  • పురుడు కోసం వచ్చి పరలోకం చేరిన వైనం
  • ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుని నిర్వాకం
  • తల్లీ బిడ్డ ఇరువురు మరణం

AP | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో చోటుచేసుకున్న దారుణ ఘటన ప్రజలను తీవ్రంగా కలచివేసింది. నిండు గర్భిణీగా ఉన్న హరిణి కుమారి అనే మహిళతో పాటు అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళవారం జరిగిన ఈ ఘటనకు కదిరి పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ మారుతి ప్రసాద్ నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మృతురాలు హరిణి కుమారి స్వగ్రామం కదిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్పీ కుంట మండలం జవకల గ్రామం. ఏడాది క్రితమే ఆమెకు వివాహమైంది. గర్భధారణ పూర్తి కావచ్చిన నేపథ్యంలో వారం రోజుల క్రితం కదిరి పట్టణంలోని ఎ ప్రైవేటు హాస్పిటల్‌లో ప్రసవం కోసం చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ సందర్భంగా ‘నార్మల్ డెలివరీ చేస్తాం’ అంటూ డాక్టర్ మారుతి ప్రసాద్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అవసరమైన వైద్య జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే తల్లి, బిడ్డ ప్రాణాలు కోల్పోయారని వారు ఆరోపించారు. ఘటన వెలుగులోకి రాగానే మృతురాలి బంధువులు, స్థానికులు హాస్పిటల్ ఎదుట పెద్ద ఎత్తున గుమిగూడి ఆందోళన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, హాస్పిటల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ ధర్నాకు సీపీఎం, సీపీఐ నాయకులు కూడా మద్దతు పలికారు. వైద్య నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం జరిగిందని ఆరోపిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని వారు కోరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు.

వైద్య నిర్లక్ష్యంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో డాక్టర్ మారుతి వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో జరిగిన వైద్య విధానాలు, చికిత్స వివరాలను సేకరిస్తున్నామని, విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో జవకల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హరిణి కుమారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ న్యాయం చేయాలని కోరుతున్నారు. తల్లి, బిడ్డ మృతి వార్త గ్రామమంతా శోకసంద్రాన్ని మిగిల్చింది. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ ఆస్పత్రులపై పర్యవేక్షణ పెంచాలని, వైద్య నిర్లక్ష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply