Palakurthy | ఎండిపోతున్న చెరువు.. పట్టించుకోని అధికారులు..

Palakurthy | ఎండిపోతున్న చెరువు.. పట్టించుకోని అధికారులు..
Palakurthy, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి గ్రామంలోని ప్రధాన చెరువు వేగంగా ఎండిపోతున్నా సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి ఇదే ప్రధాన నీటి వనరు కావడంతో తాగునీరు, పశువులకు నీరు, సాగునీరు అన్నింటికీ ఇబ్బందులు తప్పవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెరువుకు సమీపంలోనే ఎస్సారెస్పీ కాలువ ఉన్నప్పటికీ, నీటిని మళ్లించే ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే గ్రామం మొత్తం నీటి కరువులోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చెరువు అడుగు కనిపించే స్థితికి చేరిందని, బోర్లు కూడా నీరు ఇవ్వడం తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. అయినా సరే.. పాలక వర్గం స్పందించకపోవడం దురదృష్టకరమని మండిపడుతున్నారు. తక్షణమే చెరువుకు నీటి సరఫరా చేయాలని అలాగే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
