13 to 19 yrs | అమ్మాయిల్లో నెలసరి అసమానత: కారణాలు, లక్షణాలు, పరిష్కారాలు

13 to 19 yrs | నెలసరి అసమానతకు ప్రధాన కారణాలు
హార్మోన్ల మార్పుల ప్రభావం
ఒత్తిడి, నిద్ర లోపం వల్ల సమస్యలు
PCOS, థైరాయిడ్ ప్రభావం
నెలసరి సమస్యలకు ఇంట్లో చేయాల్సిన పరిష్కారాలు
డాక్టర్‌ను సంప్రదించాల్సిన సందర్భాలు

13 to 19 yrs | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టీనేజ్ వయస్సులో అంటే, 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సులో నెలసరి అసమానత చాలా మంది అమ్మాయిల్లో కనిపించే సాధారణ సమస్య. ఈ సమస్య వారి శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు, తినే ఆహారం, నిద్ర, ఆలోచనలు తదితర జీవనశైలి కారణాల వల్ల ఇలా జరుగుతుంది.
ఈ సమస్యకు గల ప్రధాన కారణాలు..


హార్మోన్ల మార్పులు
ప్యూబర్టీ దశలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్లు తరచుగా మార్పులు చెందుతూండడం వల్ల ఇంకా పూర్తిగా సమతుల్యంలో ఉండవు. వాటి ప్రభావం వల్ల నెలసరిలో అసమతుల్యత ఏర్పడుతుంది.

మానసిక ఒత్తిడి
సహజంగా ఈ పోటీ ప్రపంచంలో ఉండే చదువు ఒత్తిడి, ఇంట్లో తల్లిదండ్రుల ఎక్స్ పెక్టేషన్స్, క్లాస్ పోర్షన్స్, ర్యాంకులు, అలాగే భద్రతా పరమైన, లేదా చదువుకునే చోట ఎదురయ్యే ఏవైనా సామాజిక సమస్యల తాలూకూ భావోద్వేగ సమస్యలు ఇవన్నీ కలిపి మెదడులోని హార్మోన్ నియంత్రణను ప్రభావితం చేస్తాయి.

పోషకాహార లోపం
ఈరోజుల్లో యువత ముఖ్యంగా ఆమ్మాయిలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య ఇది. ఎందుకంటే, టైముకి తినక పోవడం, తగినంత తినక పోవడం, వీటివల్ల శరీరానికి కావలసిన ఐరన్, విటమిన్లు, ప్రోటీన్ లు అందకపోవడం వల్ల శరీరంలోని అన్ని అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపి, పీరియడ్స్ సక్రమంగా రావు.

శరీర బరువులో సంభవించే మార్పులు
అమ్మాయిల్లో తరచుగా సంభవించే సమస్య అధిక బరువు. లేదా, తక్కువ బరువు. ఇవి రెండూ వారి శరీరంలో అనేక వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి తద్వారా వారి నెలసరిపై ప్రభావం చూపుతాయి.

రోజులో కావలసినన్ని గంటల నిద్ర లోపం.
ఈరోజుల్లో చిన్నపిల్లల దగ్గర్నుండి అందరూ ఎదుర్కొంటున్న సమస్యనే. అయితే, బెడ్ మీదకు చేరాక నిద్ర రావడం లేదంటూ మొబైల్ పట్టుకొని అలాగే రీల్స్, చాటింగ్ లు చేస్తూండడం, లేదా కాస్త కళ్ళు మూసుకున్నా మెస్సేజ్ ల సౌండ్ వినిపిస్తుందేమోనని అలెర్ట్ గా పడుకోవడం…ఇలా గంటలకొద్దీ గడచి పోవడం వల్ల రాత్రుళ్ళు నిద్ర చాలదు. సరైన నిద్ర లేకపోతే ఆ ప్రభావం హార్మోన్ల క్రమం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. హార్మోన్ సైకిల్ డిస్ట్రబ్ అవుతుంది. నెలసరి ఆలస్యం/త్వరగా రావడానికి ఇదీ ఓ కారణమే.

అధిక వ్యాయామం
ఈ మధ్య అమ్మాయిలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బాడీ షేమింగ్…కొద్దిగా లావు కనబడుతున్నామని భావించగానే జిం లకు పరిగెత్తో, లేక ఇంట్లోనే వ్యాయామానికి కావాల్సినవి కొనుక్కొనో, వ్యాయామం, లేదా డాన్స్ లు చేస్తూ ఒళ్ళు హూనం చేసుకుంటున్నారు. ఇలా అతిగా జిమ్, డాన్స్, ఫిజికల్ ట్రైనింగ్ చేయడం వల్ల త్వరగా బాడీ షేప్ కి రావడం సంగతి అటుంచి, ఆ అధిక శ్రమ వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం కావచ్చు.

థైరాయిడ్ సమస్యలు
ఈమధ్య చాలా కామన్ అయిపోయిన ఆరోగ్య సమస్య థైరాయిడ్. థైరాయిడ్ హార్మోన్లు అసమతుల్యత అంటే ఎక్కువ, లేదా తక్కువ ఉన్నా నెలసరి త్వరగా రావడమో, లేదా ఆలస్యంగా రావడమో జరుగుతుంది.

పీసీవోఎస్
టీనేజ్ అమ్మాయిల్లో పెరుగుతున్న ముఖ్యమైన కారణం
దీనివల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం కావొచ్చని వైద్య నిపుణులంటున్నారు.
ఇలా అసమతుల్యమైన శరీర స్థితి వల్ల ముఖంపై ఎక్కువ మొటిమలు, జుట్టు అధికంగా పెరగవచ్చు. తిన్నా, తినకపోయినా, శరీర బరువు పెరగడం సమస్యలు ఎదురవుతాయి.

నెలసరి అసమానతకు పరిష్కారాలు.

సాధారణంగా ఈ సమస్యలన్నిటికీ ఇంట్లోనే, అమ్మ చెప్పినట్టు వింటే పరిష్కారమయ్యే మార్గాలే ఉంటాయి. వాటిలో కొన్ని…
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.
ఉదాహరణకు : ఐరన్ ఉన్న పదార్థాలు : పాలకూర, ఖర్జూరాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
తరచుగా తీసుకునే జంక్ ఫుడ్ బాగా తగ్గించాలి. లేదా, పూర్తిగా మానెయ్యాలి. ఎందుకంటే, వీటిలో ఉండే ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్, ఎక్కువ గంటలు/ రోజులు ఫ్రిజ్ లో దాచిన పదార్థాలు శరీర్మలోని అన్ని అవయవాలపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని కలిగిస్తాయి.

సరైన నిద్ర. కచ్చితంగా ఒక నియమం పెట్టుకోవాలి. బెడ్ పై చేరగానే మొబైల్ వైఫై, మొబైల్ డేటా ఆఫ్ చేయడం, లేదా అనవసరమనుకుంటే పూర్తిగా మొబైల్ నే స్విచాఫ్ చేసేసి, ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా, నిశ్శబ్ధంగా నిద్రలోకి జారుకోవాలి. సరైన సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకుంటే, సరిగ్గా వేకువనే ఉత్సాహంగా మెలకువ వస్తుంది. సరైన నిద్ర శరీరానికి, మనసుకి లభిస్తే, రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. రోజుకు కనీసం 7–8 గంటలు నిద్ర అవసరం అన్ని గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.

వ్యాయామం

వ్యాయామం అనగానే గంటలకొద్దీ జిం లో కష్టపడడం మాత్రమే కాదు, రోజూ పరిమిత సమయానికి వాకింగ్, యోగా, లైట్ ఎక్సర్ సైజ్ చేయాలి. అవసరమైతే ఎంతసేపు వ్యాయామం ఎంత చేయాలనేదానిపై నిపుణుల సలహా తప్పక తీసుకోవాలి. వారి సూచన, సలహాల మేర కే చేయాలి.

శారీరక, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం.
దీనికి అనేక మార్గాలున్నాయి. ధ్యానం, చక్కటి ప్రశాంతమైన సంగీతం, ఇష్టమైన హాబీలు, అంటే బొమ్మలు గీయడం, లేదా పాటలు పాడడం, లేదా ఏవైనా క్రాఫ్ట్ ల లాంటివి మానసికోల్లాసానికి, ఒత్తిడిని తగ్గించడానికి చాలా బాగా ఉపకరిస్తాయి

పీరియడ్ ట్రాకింగ్

గుర్తు పెట్టుకున్నామనుకొని మర్చిపోయి అయోమయానికి గురై కంగారుపడేకంటే, క్యాలెండర్ లేదా మొబైల్ యాప్ ద్వారా సైకిల్ గమనించాలి.

డాక్టర్‌ను సంప్రదించాల్సిన సందర్భాలు ఇవే, మొదటిది కొన్ని నెలలకు పైగా పీరియడ్స్ రాకపోతే, లేదా నెలసరిలో చాలా అధికంగా రక్తస్రావం ఉంటే తప్పక డాక్టర్ ను సంప్రదించాలి. ఇంకా నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పులు ఉన్నా, పీసీవోఎస్ లక్షణాలు కనిపించినా, డాక్టర్ ని వెంటనే సంప్రతించడం మంచిది.

నెలసరి అసమానత చాలా సందర్భాల్లో సాధారణమే అనుకుంటే పొరబాటే. నిర్లక్ష్యం చేయకుండా సమీక్షించుకుని ఆరోగ్యకర జీవనశైలి పాటించడం, అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం అత్యంత ముఖ్యం.
(ఈవ్యాసం పాఠకుల ప్రాధమిక ఆరోగ్య అవగాహన కొరకు మాత్రమే అందించబడుతోంది. అసమతుల్యమైన నెలసరి కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించడం తప్పనిసరి)

click here to read more

click here to read Benefits | ఉదయాన్నే తాగితే ఇవి అమృతమే..

Leave a Reply