77th Republic Day | ప్రజాస్వామ్య పాలనకు బలమైన పునాది..

77th Republic Day | ప్రజాస్వామ్య పాలనకు బలమైన పునాది..

  • జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్..
  • శాంతి, ఐక్యతకు భారత రాజ్యాంగమే పునాది ఎస్పీ..

77th Republic Day | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది అని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసు సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం పోలీసు సిబ్బందికి, జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో ప్రజాస్వామ్య పాలనకు బలమైన పునాది ఏర్పడిందని గుర్తు చేశారు. దేశం ఎన్నో భౌగోళిక, రాజకీయ, అంతర్గత భద్రతా సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ శాంతి భద్రతలు నిలకడగా కొనసాగుతున్నాయని అన్నారు. దీనికి భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడిన వ్యవస్థతో పాటు ప్రజల క్రమశిక్షణ, ఐక్యత, బాధ్యతాయుతమైన భాగస్వామ్యమే ప్రధాన కారణమని తెలిపారు.

రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే..
భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే నేడు కుల, మత భేదాలకు అతీతంగా విద్యార్హతల ఆధారంగా ఉద్యోగాలు పొందగలుగుతున్నామని పేర్కొన్నారు. రాజ్యాంగం అమలులోకి రాకముందు రాజుల పాలన కొనసాగిన పరిస్థితుల నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థకు మారడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన ఓటు హక్కు ద్వారా ప్రజలే తమ నాయకులను ఎన్నుకునే అవకాశం పొందారని తెలిపారు. వివిధ కులాలు, మతాలు ఉన్నప్పటికీ దేశంలో శాంతియుతంగా జీవించగలుగుతున్నామంటే అందుకు భారత రాజ్యాంగమే మూలమని స్పష్టం చేశారు.

సవాళ్లతో గడిచిన గత ఏడాది..
గత ఏడాది కాలం తెలంగాణ పోలీసు శాఖకు సవాళ్లతో కూడినదిగా గడిచిందని, స్థానిక సంస్థల ఎన్నికలు, విపత్తులు, అనూహ్య పరిస్థితులను సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా నిర్వహించిందన్నారు. పోలీసు శాఖకు ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొంటూ, రాబోయే కాలంలోనూ ఇదే విధమైన సహకారం అందించాలని కోరారు. తెలంగాణ పోలీసును దేశంలోనే ఉత్తమ పోలీసు వ్యవస్థగా తీర్చిదిద్దడంతో పాటు శాంతియుత, సురక్షిత సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా పని చేద్దాం అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సిహెచ్. రఘునందన్ రావ్, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్యగౌడ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కళ్యాణి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, ఆర్‌ఐలు రాజశేఖర్, డానియల్, శ్రీనివాస్, సూపరింటెండెంట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply