TG | కౌన్సిలర్ టిక్కెట్…కాంగ్రెస్‌లో హాట్…!

TG | కౌన్సిలర్ టిక్కెట్…కాంగ్రెస్‌లో హాట్…!
- ఆశావాహులు అధికమే..!
- గెలుపు గుర్రాల వేటలో అధిష్టానం
- అభ్యర్థుల ఎంపిక కై వార్డుల్లో సర్వే
- తప్పని రెబల్స్ పోరు..!
TG | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ టిక్కెట్… కాస్త హాట్ కేక్ గా మారింది. 12 వార్డులలో కౌన్సిలర్ టిక్కెట్ కోసం ఆశావహుల సంఖ్య అధికంగానే ఉంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఎమ్మెల్యే సామెల్ వార్డ్ ఇంచార్జి లను సైతం నియమించారు. ఇప్పటికే ఆయా వార్డులలో ఇంచార్జి లు గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమయ్యారు. ఆయా అభ్యర్థుల ఓటు బ్యాంకు ఎలా ఉంది అని ఆరా తీస్తున్నారు.
కొన్ని వార్డులలో అభ్యర్థులు హేమాహేమీలుగా ఉండడంతో ఆయా వార్డులలో టిక్కెట్ రాని పక్షంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గా రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మరికొంతమంది కాంగ్రెస్ లో టిక్కెట్ రాకుంటే …ఏకంగా పార్టీ మారి బి ఆర్ ఎస్ తరపున సైతం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ మున్సిపల్ ఎన్నికలు కాస్త పార్టీ సింబల్ (గుర్తు)తో పోటీ ఉండడంతో … పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు అటు కాంగ్రెస్.. ఇటు బి ఆర్ ఎస్ తరపున పోటీకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు.
స్వతంత్ర అభ్యర్ధులు గా నిలబడి గెలవడం సాధ్యం కాదని …ఎదో ఒక పార్టీ తరపున నిలబడితేనే ఓటు బ్యాంకు సాధ్యమౌతుందని ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ రెబల్స్ పోటీలో ఉంటే.. బీఆర్ ఎస్ అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఉంటాయని బి ఆర్ ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బీఆర్ ఎస్ పార్టీ సైతం ఆయా వార్డులలో వార్డ్ ఇంచార్జి లను నియమించి వార్డుల వారీగా ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బీజేపీ పార్టీ తరపున సైతం అన్ని వార్డులలో పోటీకి దింపేందుకు ఎన్నికల ఇంచార్జి సమంత నేతృత్వంలో ఇటీవల సన్నాహక సమావేశం సైతం నిర్వహించారు. ఎస్సి మహిళలకు చైర్మన్ పదవి రిజర్వ్ కావడంతో…. 2,6 ఎస్సి రిజర్వ్ వార్డులతో పాటు 5,12 వ వార్డ్(జనరల్ మహిళ) వార్డులలో సైతం …ఎస్సి అభ్యర్థులు చైర్మన్ పదవి పై ఆశతో రంగంలోకి దిగుతున్నారు.
ఏదైమైనప్పటికి ఇంకా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకపోవడంతో… ఆయా వార్డులలో ఆశావహులు ముఖ్య నాయకులు, ఓటర్లను కలుస్తూ తమ అభ్యర్థిత్వం బలపరచాలని కోరుతున్నారు. మరో పక్క ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒక వార్డులో పోటీకి దిగనున్న అభ్యర్థి ఇప్పటికే ఇంటింటికీ వాటర్ క్యాన్లు సైతం పంపిణీ చేశారు. ధీంతో ఆయా వార్డులలో కౌన్సిలర్ పదవి కోసం పోటీ బలంగా నే ఉండనుంది.
