Medaram | జాతర డ్యూటీలు చేసే వారంతా అప్రమత్తంగా ఉండాలి

Medaram | జాతర డ్యూటీలు చేసే వారంతా అప్రమత్తంగా ఉండాలి
- దుమ్ము, ధూళి, చలి తీవ్రతల బారిన పడొద్దు
- హెల్త్ కేర్ మరువొద్దు, డ్యూటీని నిర్లక్ష్యం చేయొద్దు
- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
- 50 వేల మాస్కులందించిన సీసీఎస్ పోలీసులు
Medaram | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : ప్రతి రెండేళ్ళకొకసారి వచ్చే మేడారం మహా జాతరలో విదులు నిర్వర్తించేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. 5 రోజుల పాటు జనసంద్రంతో సాగే జన జాతరకు తరలి వచ్చే భక్తుల సేవలో నిమగ్నమయ్యే పోలీసులు ఈమారు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించారు. మేడారం మహా జాతరలో దుమ్ము, ధూళితో పాటు ఎముకలు కొరికే చలి తీవ్రత బాధిస్తోంది. జన జాతరలో తలెత్తే సమస్యలను పోలీస్ ఉన్నతాధికారులు ముందస్తుగానే గుర్తించి పోలీస్ (Police) సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. జాతర విధులు నిర్వర్తించి అనారోగ్యాల బారిన పడకుండా ఉండే ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అప్రమత్తం చేస్తున్నారు. మేడారం మహా జాతరలో ప్రధాన పాత్రను పోషించే పోలీస్ ఫోర్స్ ఆరోగ్య పరిరక్షణకై అధికారులు చొరవను చూపుతున్నారు.

వచ్చే వారంలో ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విధులు నిర్వహించేందుకు తరలి వెళ్ళే పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం మాస్కులు సమకూర్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్ర డ్రగ్స్ ఔషధ గిడ్డంగుల విభాగం సహకారంతో యాభై వేల మాస్కులను సీసీఎస్ పోలీసులు సేకరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా పోలీస్ ఫోర్స్ కు (Police Force) అందించేందుకు గాను అందజేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ… ప్రధానంగా రోడ్డు మార్గంలో విధులు నిర్వహించే పోలీసులు తప్పని సరిగా మాస్క్ లు ధరించే విధంగా పోలీస్ అధికారులు చొరవ చూపాలన్నారు. దుమ్ము, ధూళి బారిన పడకుండా చేసుకోవాలన్నారు. మాస్కులు ధరించక పోతే ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే ప్రమాదముందని ఎత్తి చూపారు.

చలి తీవ్రత బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీసులు జాతర డ్యూటీకి ప్రాధాన్యమిస్తూనే హెల్త్ కేర్ పై ఫోకస్ చేయాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ (Sunpreet Singh) సూచించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార. కవిత, ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, అదనపు డీసీపీలు, బాలస్వామి, రాయల ప్రభాకర్ రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్ర డ్రగ్స్ ఔషధ గిడ్డంగుల ఇంచార్జి డా. భాస్కర్ రావు ఏసీపీలు సదయ్య, జాన్ నర్సింహులు, సురేంద్ర, ప్రశాంత్ రెడ్డి, సత్యనారాయణ, సీసీఎస్, పర్వతగిరి ఇన్స్ స్పెక్టర్లు ఆలే. రాఘవేందర్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
