Garbage | జగ్గయ్యపేటలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర..

Garbage | జగ్గయ్యపేటలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర..
- రోడ్లు ఊడ్చి, చెత్త తొలగించిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్..
- భారీ ర్యాలీతో ప్రజల్లో పారిశుధ్య అవగాహన…
Garbage | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జగ్గయ్యపేట పట్టణంలో పారిశుధ్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), మున్సిపల్ చైర్మన్ శ్రీరంగాపురం రాఘవేంద్ర, తెలుగునాడు అంగన్వాడి–డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య, మున్సిపల్ చైర్మన్ స్వయంగా చీపుర్లు పట్టి మున్సిపల్ కార్యాలయ పరిసరాలు, పట్టణ ప్రధాన రహదారుల్లో రోడ్లను ఊడ్చి పేరుకుపోయిన చెత్తను తొలగించారు.

పారిశుధ్య పనుల్లో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ పారిశుధ్య కార్మికులకు నైతిక మద్దతు అందించారు. అనంతరం పట్టణ ప్రధాన రహదారుల గుండా నిర్వహించిన ర్యాలీలో ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత ద్వారా వ్యాధుల నివారణ సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జగ్గయ్యపేటను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని కోరారు. ర్యాలీ అనంతరం ప్రజాప్రతినిధులు స్థానిక అన్నా క్యాంటీన్ను సందర్శించారు. అక్కడ భోజన నాణ్యతను పరిశీలించి అధికారులతో కలిసి అల్పాహారం సేవించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు పేదవారి ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తులసి కృష్ణారావు, కౌన్సిలర్లు కన్నెబోయిన రామలక్ష్మి, నకిరకంటి వెంకట్, దువ్వల రామకృష్ణ, కాటగాని నరసింహారావు, నోముల రఘు, గింజుపల్లి కృష్ణ, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
