Team india |మీకు క‌నిక‌రం లేదా..?

మీకు క‌నిక‌రం లేదా..?

టీమిండియా వెరీ స్ట్రాంగ్‌
300 ప‌రుగులైనా కొట్టేసేలా ఉన్నారు
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్

Team india |వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : నిన్న జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్‌ను టీమిండియా బ్యాట‌ర్లు చిత‌క్కొట్టేశారు. న్యూజిలాండ్ నిర్దేశించిన 209 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఈజీగా కొట్టేశారు. భార‌త ఆట‌గాళ్ల జోరును చూసి కివీస్ ఆట‌గాళ్లు బిత్త‌ర‌పోయారు. ఇషాన్ కిష‌న్, కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ సిక్సులు కొడుతుంటే వారికి చుక్క‌లు క‌నిపించాయి. ఇలా కొడితే.. ఎలా గెలుస్తామ‌ని న్యూజిలాండ్ కెప్ట‌న్ మిచెల్ శాంట్న‌ర్ బేల ముఖం వేశాడు. టీ20లో 300 ప‌రుగులు చేసినా టీమిండియా గెల‌వ‌లేమ‌ని స్వ‌యంగా ఒప్పుకున్నాడు. మ‌రీ ఇంత దారుణంగా, క‌నిక‌రం లేకుండా కొడ‌తారా అన్న‌ట్లు వ్యాఖ్యానించారు.

న్యూజిలాండ్ కెప్టెన్ ఏమ‌న్నాడంటే..?
టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి రెండో టీ20 మ్యాచ్ చాలని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టుపై 209 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా ఓటమి తప్పకపోవడంతో, మ్యాచ్ అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “భారత్ లాంటి బలమైన, లోతైన బ్యాటింగ్ ఉన్న జట్టుపై 300 పరుగులు చేసినా సరిపోవేమో, ఇలాంటి మంచి వికెట్‌పై 200-210 పరుగులు సురక్షితం కాదని మాకు అర్థమైంది” అని శాంట్నర్ అన్నాడు. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లను పరీక్షిస్తున్నామని, ఇలాంటి ఒత్తిడిలో ఆడటం వల్ల జట్టుకు మంచి పాఠాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుందని శాంట్నర్ పేర్కొన్నాడు. తన బ్యాటింగ్ పాత్రపై స్పందిస్తూ, ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు పరుగులు చేయడం తన బాధ్యత అని, బౌలింగ్‌లోనూ రాణించాల్సి ఉంటుందని వివరించాడు. ఈ మ్యాచ్ ఫలితాలను పక్కనపెట్టి తర్వాతి మ్యాచ్‌పై దృష్టి పెడతామని ఆయన తెలిపాడు.

రెండో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (82 నాటౌట్), ఇషాన్ కిషన్ (76) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. టీ20 క్రికెట్ చరిత్రలో భారత్‌కు ఇది రెండో అత్యధిక పరుగుల ఛేదన కావడం విశేషం. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (44), కెప్టెన్ శాంట్నర్ (47 నాటౌట్) రాణించడంతో కివీస్ భారీ స్కోరు సాధించింది. అయినప్పటికీ, భారత బ్యాటర్ల దూకుడు ముందు ఈ స్కోరు సరిపోలేదు.

Leave a Reply