Lion symbol | మున్సిపల్ బరిలో జాగృతి

Lion symbol | మున్సిపల్ బరిలో జాగృతి
- సింహం గుర్తుతో బరిలోకి దిగేందుకు రెడీ
- ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన సింహం గుర్తుతో పోటీ
- ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు
- కవిత చేతిలో ఫార్వర్డ్ బ్లాక్ బీ ఫామ్‌లు
Lion symbol | కరీంనగర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనుకుంటున్న కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయాలు చేస్తున్నారు. గతంలో ఆమె తండ్రి కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించిన తొలినాళ్లలో స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా పార్టీ పునాదులను ఎలాగైతే పటిష్టం చేసుకున్నారో, ఇప్పుడు కవిత కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఆమె ప్రస్తుత వ్యూహం మరింత జాగ్రత్తగా అమలు చేస్తున్నారు.

కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో యమా స్పీడ్‌గా దూసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జనాలను కలుస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు. అంతే కాకుండా త్వరలో జరగబోయే పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలని కల్వకుంట్ల కవిత నేతృత్వలోని తెలంగాణ జాగృతి నిర్ణయించింది.
రానున్న మున్సిపల్ ఎన్నికలతో పాటు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ జాగృతి పోటీకి సిద్ధమవుతోంది. మరోవైపు ఆ పార్టీ ముఖ్య నేతలు రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌లో వేగం పెంచారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
దీంతో మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో.. ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని జాగృతి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఉమ్మడి గుర్తు కోసం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫారంతో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాదులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు తో పాటు ఇతర ముఖ్య నేతలతో కవిత నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కామన్ సింబల్ పై తమ మద్దతు పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో సమావేశమైన కవిత బీఫాంలో అన్ని జాగృతికి అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఎవరైనా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆశావహులు సింహం గుర్తుపై పోటీ చేయాలనుకుంటే ఇక జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్కను కలవాల్సిందే. ఇకపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీ ఫామ్ లు మాజీ ఎమ్మెల్సీ కవిత జారీ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జాగృతి నాయకులతోపాటు మద్దతుదారులకు కామన్ సింబల్ అందించాలన్న ఉద్దేశంతో కవిత ఈ మేరకు వ్యూహరచన చేసినట్లు సమాచారం.
Lion symbol | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక ప్రభావం..
మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సింహం గుర్తు అత్యధిక ప్రభావం చూపనుంది. గతంలో పలు పార్టీల ఆశావహులు ఆయా పార్టీల్లో టికెట్ రాకపోవడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున సింహం గుర్తు పై పోటీ చేసి విజయం సాధించిన విషయం విదితమే. రామగుండం శాసనసభ్యునిగా కోరుకంటి చందర్ సింహం గుర్తు పై పోటీ చేసి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఆపై గులాబీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.
ఇదే మాదిరిగా పలువురు ఆయా పార్టీల్లో టికెట్టు ఆశించి రాకపోవడంతో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున సింహం గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ వ్యాప్తంగా సింహం గుర్తు బీఫాంలు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జారీ చేయను ఉండడంతో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
Lion symbol | ఎవరికి నష్టం.. ఎవరికి లాభం..
అయితే మున్సిపల్ ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి బరిలో దిగబోతోంది. అయితే దీని ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంతమేరకు ఉంటుందోనని చర్చ కొనసాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తే కవితకు లాభం ఎంత మేరకు ఉంటుంది…? ఎవరికి నష్టం కలుగుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బీఆర్ ఎస్‌కు గట్టి దెబ్బ కొట్టాలనే మున్సిపల్ పోరుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో జాగృతి బలంగా పోటీ ఇస్తే మాత్రం గులాబీ దళానికి నష్టం కలిగి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే సమయంలో వీరి మధ్య పోరుతో కాంగ్రెస్ పార్టీ లాభం పొందే చాన్స్ కూడా ఉందని పలురువు రాజకీయ విశ్లేషకులు ఈ విషయంలో కవితక్క ఎంతమేర సఫలమవుతుందో మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.
