NZB | రాజీపడే కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలి..

నిజామాబాద్ ప్రతినిధి, మార్చి6 (ఆంధ్రప్రభ) : జనబహుళ్యపు ఆకాంక్షల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తన అధికారిక విధులను నిర్వహిస్తున్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల తెలిపారు. రాజీ పడదగిన కేసులను ఈ జాతీయలోక్ అదాలత్ ద్వారా పరిష్కరించు కోవాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ మార్చి 8న నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం న్యాయసేవ సదన్ లో విలేకరుల సమావేశంలో సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతితో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల మాట్లాడారు. ప్రజలందరికీ న్యాయ విజ్ఞానాన్ని అందించడంలో సంస్థ తన వంతు కృషి చేస్తుందన్నారు. పొక్సో క్రిమినల్ కేసుల్లో బాధితులకు ఆర్థికంగా అండగా నిలిచామని పేర్కొన్నారు.

జిల్లాలో బాలికల స్వయం భద్రతకు బాటలు వేశామని, ఆత్మరక్షణకు అవసరమైన మేరకు శిక్షణ ఇప్పించడం న్యాయసేవ సంస్థ కీర్తికిరీటంలో కలికితురాయిగా నిలిచి పోతుందని జిల్లాజడ్జి అభిలాషించారు.రాజీపద్దతిన రాజీపడదగిన క్రిమి నల్ కేసులు,అన్ని రకాల సివిల్ దావాలు వీలైనంత వరకు జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారం అయ్యేవిధంగా కృషి చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం లీగల్ అవేర్ నెస్, మాడ్యూల్ క్యాంప్ లను జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు తెలియజేశారు. శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *