AP | ఆ క్రషింగ్ నిజమేనా? విడుదల రజనీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు …

విడదల రజనీపై విచారణకు స‌న్నాహాలు
అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ రాసిన ప్ర‌భుత్వం
వైసీపీ హ‌యాంలో మాజీ మంత్రి ర‌జ‌నీ అక్ర‌మ దందా
స్టోన్ క్ర‌ష‌ర్స్‌ను బెదిరించి పెద్ద మొత్తంలో వ‌సూళ్లు
ఓ ఐపీఎస్ ఆఫీస‌ర్ హ‌స్తం కూడా ఉన్న‌ట్టు ఆరోప‌ణ‌లు
ఇప్ప‌టికే సెక్ష‌న్ 17ఏ ప్ర‌కారం నోటీసులు జారీ
కేసు న‌మోదు చేసేందుకు ఉత్స‌హాంగా ఏసీబీ
గ‌వ‌ర్న‌ర్ ఆమోదం వ‌స్తే ర‌జ‌నీ కూడా లోప‌లికే

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ :

మాజీ మంత్రి విడదల రజనీ చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమానులను బెదిరించి ₹2.20 కోట్లు అక్రమంగా వసూలుచేశారన్న ఆరోపణలతో రజనీ, ఐపీఎస్ ఆఫీసర్​ జాషువాపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. వైసీపీ నేత విడదల రజనీ, ఐపీఎస్ అధికారి పల్లో జాషువాను విచారణ చేపట్టేందుకు ఏసీబీ పట్టుదలగా ఉంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమానులను బెదిరించి ₹.2.20 కోట్లు అక్రమంగా వసూలుచేశారన్న ఆరోపణలతో వారిద్దరిపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఇందులో జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్‌ అనుమతి తీసుకుంది. ఇప్పుడు విడదల రజనీ విచారణకు అనుమతించాలని ఏపీ గవర్నర్​కు ప్రభుత్వం లేఖ రాసింది. దీనికి ఒకటి, రెండు రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అది కనుక వస్తే వెంటనే వారిద్దరిపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి.

₹5 కోట్లు డిమాండ్ చేశారు..

శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ ఓనర్లను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఫిర్యాదులపై ఏపీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వైసీపీ నేత విడదల రజనీ, ఐపీఎస్ జాషువా ₹5కోట్లు డిమాండు చేసి.. ₹2.20 కోట్లు వసూలు చేశారని.. అందులో రజినికి ₹2 కోట్లు, జాషువాకు ₹10 లక్షలు, రజిని పీఏకు ₹10 లక్షలు చెల్లించారని విజిలెన్స్‌ తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది.

వేధింపుల కేసులో హైకోర్టు ఆదేశాలు..

మరోవైపు కొన్ని రోజుల క్రితమే వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచరించిన హైకోర్టు.. రజినితోపాటు ఆమె పీఏపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ చిలకలూరిపేట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టుల పెడుతున్నారని గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే విడదల రజిని, ఆమె పీఏతోపాటు పోలీసులు తనను వేధించారని చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాననే కారణంతో 2019లో పిల్లి కోటిని అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన చిలకలూరిపేట పట్టణ సీఐ తనను కోర్టులో ప్రవేశపెట్టకుండా.. తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *