Motorists | మంచు దుప్పటి

Motorists | మంచు దుప్పటి
- జిల్లా వ్యాప్తంగా పొగ మంచుతో వాహనదారులు ఇక్కట్లు
- రహదారి కానరాక లైట్లు వేసుకొని ప్రయాణం
Motorists | ఆంధ్రప్రభ, కృష్ణా బ్యూరో : కృష్ణాజిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి భారీగా మంచు కురుస్తుంది. వాతావరణ మార్పులతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు ఉదయం 9 గంటల తర్వాత రావడం కనిపించింది. రోజువారీ పనుల నిమిత్తం బయటకు వచ్చే వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణం సాగించవలసి వచ్చింది. సంక్రాంతి పండుగ ముగియడంతో పలువురు తాము పని చేసే ప్రదేశాలకు వెళ్లేందుకు ఉదయాన్నే కార్లు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణం సాగించారు. ఎదురుగా వస్తున్న వాహనాలు ఏమాత్రం కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది.

బస్సులు లారీలు సైతం దగ్గరకు వచ్చేవరకు కనిపించకపోవడంతో నిదానంగా ప్రయాణాలు చేశారు. మహాశివరాత్రి వరకు మంచు ఇలాగే కురుస్తుందని, ఉదయం పూట ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలని పలువురు గ్రామస్తులు పేర్కొంటున్నారు. అవనిగడ్డ, పెడన, పెనమలూరు, గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం నియోజకవర్గాల్లోని ప్రధాన రహదారులు సైతం మంచు దుప్పటి కప్పేయడంతో తీవ్ర అవస్థలు పడుతూ వాహనదారులు ప్రయాణాలు సాగించవలసి వచ్చింది. మంచు మొత్తం కుడుస్తుండడంతో తలభాగంలో, శరీరంపై భారీగా నీళ్లు కుమ్మరించినట్లుగా మంచు పడింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు జలుబు, దగ్గు అధికంగా ఉండడంతో బయటికి వచ్చేందుకు ప్రజలు ఆసక్తి కనపరచలేదు. ఉదయం 9 గంటల తర్వాత మంచు తెరలు వీడిపోవడంతో ప్రజలు తమ పనులను నిమిత్తం బయటకు వచ్చారు. కొంతమంది ఇళ్ళ ముందు భోగి పండుగ సమయంలో తెచ్చుకున్న కర్రలను వేసి చలి కాచుకోవడం కనిపించింది.

