Godavarikhani | రానున్నది మళ్లీ కేసీఆర్ పాలనే

Godavarikhani | రానున్నది మళ్లీ కేసీఆర్ పాలనే
- మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
Godavarikhani | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : పది సంవత్సరాల పాటు కే. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సాగిన బీ.ఆర్.ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించారని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో రాష్ట్రం అభివృద్ధి మార్గం నుంచి వెనక్కి వెళ్లుతోందని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం గోదావరిఖని చౌరస్తాలో బీ.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గాలిపటాలను ఎగురవేస్తూ ఘనంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధిలో పరుగులు తీసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని వెనుకబాటుకు నెట్టిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా రామగుండం ప్రాంత ప్రజలు భయాందోళనల మధ్య జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం ఉందని తెలిపారు. ఈ పండుగ సందర్భంగా చిన్నా పెద్దా అంతా గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందంగా వేడుకలు జరుపుకుంటారని చెప్పారు. గత పదేళ్ల బీ.ఆర్.ఎస్ పాలనలో ప్రజలు సంక్షేమ పథకాలు పొందుతూ సంతోషంగా ఉన్నారని, ఇక రానున్న రోజుల్లో మళ్లీ బీ.ఆర్.ఎస్ పాలన వస్తుందని, ప్రజలకు మంచి రోజులు తప్పకుండా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేలా బీ.ఆర్.ఎస్ కార్పొరేటర్లను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జిమ్మిబాబు, బుర్రి వెంకటేష్, నూతి తిరుపతి, కిరణ్ జీ, మెతుకు దేవరాజు, సట్టు శ్రీనివాస్, తిమోతి, పిల్లి రమేష్, నిమ్మరాజుల సాగర్, ఆర్శనపల్లి శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావన్, చింటూ, కొడి రామకృష్ణ, భానుచందర్, ఆవునూరి వెంకటేష్, కనకరాజ్, పవన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
