TG | ఎమ్మెల్సీ ‘‘ఛాంపియన్ ట్రోఫీ’’ బీజేపీదే !

  • బీజేపీ కార్యకర్తల పోరాటాలకు హ్యాట్సాఫ్
  • డబ్బులు పంచి గెలవాలనుకున్న కాంగ్రెస్ చెంప దెబ్బ
  • కాంగ్రెస్ పై యుద్ద భేరీ మోగిస్తున్నాం
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కరీంనగర్, ఆంధ్రప్రభ : తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ‘ఛాంపియన్ ట్రోఫీ’లో బీజేపీ విజయం సాధించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈరోజు (బుధవారం) రాత్రి పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలిచిన అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు గుణపాఠమన్నారు.

బీజేపీ కార్యకర్తల పోరాటాలకు హ్యాట్సాఫ్ అని, బీజేపీకి అండగా నిలిచిన ఓటరు మహాశయులకు శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నానన్నారు.

డబ్బులు పంచి గెలవాలని చూసిన కాంగ్రెస్ అభ్యర్ధి చెంప చెళ్లుమన్పించారన్నారు. నోట్లు పంచిన వారిని వదిలిపెట్టబోమని, గూగుల్ పే వివరాల లెక్కలు తీస్తున్నామన్నారు.

కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది నాలుగో విజయని, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలతో పాటు నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ, ఇయాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు సాధించామన్నారు.

వాళ్లు డబ్బు సంచులను నమ్ముకున్నారని, మేం ఓటర్లను నమ్ముకున్నామన్నారు. నోట్ల సంచులు ఓడిపోయాయని, ఓటర్లే గెలిచారన్నారు.

ఈవీఎంలను మేనేజ్ చేసి బీజేపీ గెలుస్తుందని పదేపదే దుష్ప్రచారం చేసిన రాహుల్ గాంధీకి నేను సవాల్ విసురుతున్నానని, ఈవీఎంల ద్వారా మాత్రమే కాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్వహించిన బ్యాలెట్ పేపర్ ద్వారా కూడా బీజేపీయే గెలిచిందన్నారు. దీనికేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేసినా, డబ్బు సంచులను పంచినా ఓటుకు రూ.5 వేల చొప్పున పంచినా వారి కుట్రలు ఫలించలేదన్నారు.

మేం నయాపైసా ఖర్చు చేయలేదని, మా కార్యకర్తలే కష్టం, మోదీ పాలన, అమ్మవారి దయవల్లే ఈరోజే మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు.

ఇకనైనా కాంగ్రెస్ దిగిరావాలని, రాష్ట్రంలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు రాష్ట్ర ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చారన్నారు. వెంటనే 6 గ్యారంటీలను అమలు చేయాలని, అలాగే 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తి చేయాలన్నారు.

ఇచ్చిన మాట మేరకు రూ.4 వేల నిరుద్యోగ భ్రుతి ఇవ్వాలని, అట్లాగే ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని అమలు చేయాలన్నారు. 5 పెండింగ్ డీఏలు, రిటైర్డ్ మెంట్ బెన్ ఫిట్స్, జీపీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. వీరితోపాటు రైతులకు, మహిళలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *