125 days work | ‘‘వీబీ-జీ రామ్ జీ’’ పథకం ఎందుకు వద్దు?

125 days work | ‘‘వీబీ-జీ రామ్ జీ’’ పథకం ఎందుకు వద్దు?
- తెలంగాణకు అదనంగా రూ.340 కోట్లు రాబోతున్నాయి
- దేశవ్యాప్తంగా అదనంగా రూ.17 వేల కోట్లు వస్తాయి
- గ్రామాలకు ఆస్తులను సృష్టించే పథకం
- రైతులకు ఉపశమనం కలిగించే స్కీం
- ప్రతి ఒక్కరికీ 125 రోజుల పని కల్పించబోతున్నాం
- నేరుగా డబ్బులన్నీ కూలీల ఖాతాలోనే పడతాయి
- నిర్ణీత టైంలో పని కల్పించకపోతే వడ్డీతోసహా ఉపాధి భత్యం చెల్లించాల్పిందే
- ప్రజలకు మంచి జరుగుతుంటే కాంగ్రెస్ కు ఎందుకింత అక్కసు?
- నూతన ఉపాధి పథకం కావాలా? వద్దా? సమాధానం చెప్పాలి
- వాంబే ఇండ్ల స్కీం పథకంలో వాల్మీకీ, అంబేద్కర్ పేర్లను ఎందుకు తొలగించారు?
- ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరును తొలగించి రాజీవ్ గాంధీ పేరును పెట్టలేదా?
- కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
125 days work | హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘వీబీ-జీ రామ్ జీ’’ పథకం అద్బుతమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. గ్రామానికి స్థిర ఆస్తులను స్రుష్టించడంతోపాటు ప్రతి ఒక్కరికి కచ్చితంగా 125 రోజుల పని(125 days of work) దొరుకుతుందన్నారు. వ్యవసాయ సీజన్ లో కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ పథకం ద్వారా ఉపశమనం కల్పించబోతోందన్నారు.
గతంతో పోలిస్తే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.17 వేల కోట్లు కేటాయించబోతోందన్నారు. తెలంగాణకు సైతం రూ.340 కోట్లు(Rs. 340 crores) అదనంగా రాబోతున్నాయని తెలిపారు. ఇంత గొప్ప పథకాన్ని అడ్డుకోవాలని చూడటం కాంగ్రెస్ నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తీసేయడంపై కాంగ్రెస్ అనవసరం రాద్దాంతం చేస్తోందన్నారు.
తొలుత ఈ పథకానికి మహాత్ముడి పేరే కాంగ్రెస్ పెట్టలేదని చెప్పారు. పాలకులు మారినప్పుడు పథకాల పేర్లు మారడం సహజమేనని, గతంలో వాల్మీకీ, అంబేద్కర్ పేర్లతో వాజ్ పేయి ప్రభుత్వం వాంబే స్కీం పేరుతో ఇండ్ల నిర్మాణ పథకాన్ని ప్రవేశపెడితే… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారి పేర్లను తొలగించి ఇందిరాగాంధీ ఆవాస్ యోజన పథకంగా మార్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా నామకరణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
