భీంగల్ ను బకాసురుల చేతిలో పెట్టకండి..

భీంగల్ ను బకాసురుల చేతిలో పెట్టకండి..
భీమ్‌గల్‌ను దోచుకునే శక్తుల నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే
ఎన్నికలు వచ్చాయని శంకుస్థాపన ల పేరుతొ మభ్యపెడుతున్నారు
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యరులను గెలిపించండి
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 9వ వార్డులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లలో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ ఎన్నికలను అవకాశంగా తీసుకుని మోసపూరిత శక్తులు ప్రజల వద్దకు వస్తున్నాయని, ఒకసారి అవకాశం ఇస్తే పట్టణానికే కాదు ప్రజల ఇళ్లకూ దోపిడీ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి శక్తులను నమ్మితే భీమ్‌గల్ మాత్రమే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని భీమ్‌గల్ పట్టణ ప్రజలను అప్రమత్తం చేశారు.
భీంగల్ పై తనకు అపారమైన ప్రేమ ఉందని, ఈ పట్టణాన్ని ఒక సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దాలని కలలు కని వాటిని ఆచరణలో పెట్టానని తెలిపారు. “నాకు భీంగల్ అంటే ఎనలేని మక్కువ. అలాంటి పట్టణాన్ని బకాసురుల చేతిలో పెట్టి ప్రజలు తప్పు చేయవద్దు” అని కోరారు.

భీంగల్ ను డెవోలోప్ చేసింది బీఆర్ఎస్
గ్రామంగా ఉన్న భీమ్‌గల్‌ను మున్సిపాలిటీగా మార్చి సుమారు ₹200 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు.ఈ అభివృద్ధి వల్లే భీమ్‌గల్‌లో భూముల మార్కెట్ విలువ గణనీయంగా పెరిగిందని తెలిపారు.భీమ్‌గల్‌లో మిగిలిపోయిన పనుల కోసం తాను ₹10 కోట్ల నిధులు మంజూరు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా ఆ పనులను రెండేళ్లుగా నిలిపివేసిందని ఆరోపించారు. ప్రాంత ప్రజల ఆరాధ్య దైవస్థలం లింబాద్రి గుట్టకు వెళ్లే రోడ్డును 4 లైన్ల రోడ్డుగా, సెంట్రల్ లైటింగ్, డివైడర్‌తో పాటు గిరి ప్రదక్షిణ రోడ్డును అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. భీమ్‌గల్ ప్రజలకు స్థానికంగానే వైద్యం అందాలనే ఉద్దేశంతో రూ 40 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి 80 శాతం పనులు పూర్తి చేసినా, మిగిలిన పనులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆసుపత్రిని ప్రారంభించకపోవడం దురదృష్టకరమన్నారు.
అలాగే 6 కోట్లతో చేపట్టిన మార్కెట్ పనులు, భీమ్‌గల్ బస్ డిపోను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 25 నెలలైనా ఒక్కటైనా అమలు చేయలేదని మండిపడ్డారు. మహిళలకు నెలకు ₹2500, అవ్వాతాతలకు ₹4000 పింఛన్ వంటి హామీలు అమలు చేయక ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే తీర్పు రావాలని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే ప్రజల హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాడుతారని అన్నారు. బీజేపీకి ఓటు వేసి ఓటును వృథా చేసుకోవద్దని కోరారు. ప్రజలతో కలిసి ఉండే పార్టీ బీఆర్ఎస్ అని, సమస్య వస్తే వెంటనే ప్రజల పక్షాన నిలబడేది తమ పార్టీ అభ్యర్థులేనని తెలిపారు. భీమ్‌గల్ భవిష్యత్తు కోసం కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

