ఇదీ .. బీహారీ స్టోరీ
సరీగా పాతికేళ్ల కిందట.. బీహార్ రాజకీయ క్రీడలో.. ఏక్ దిన్ కా సుల్తాన్ ..కాదు, సాత్ దిన్ కా సుల్తాన్ తెర మీదకు వచ్చారు. రాజకీయ చదరంగంలో ఎత్తులు, జిత్తుల్లో .. రాజకీయ తంత్రంలో దిట్ట. శత్రువు పక్కలో శత్రువే అతడి హితుడు. మిత్రుడి కౌగిట్లో సన్నిహితుడే పగస్తుడు. మిత్రలాభం తెలుసు. మిత్రభేదమూ ఎరుకే. పొత్తు పెట్టుకోగలడు. నిర్దయగా తుంచగలడు. అందుకే ఆయన బీహారీ పాల్తూరామ్ అనే పేరును సార్థకం చేసుకున్నారు. ఆయన విధేయత క్షణభంగురం. ఏ నిముషానికి ఏ నిర్ణయం తీసుకుంటారో.. ఆ రహస్యం పెరుమాళ్లకే ఎరుక.ఎందుకంటే అధికారమే ఆయన లక్ష్యం. పరిపాలనే ధ్యేయం. ఇప్పటికి తొమ్మిదో సారి సీఎంగా బీహార్(Bihar)ను పాలిస్తున్నారు. ఈ 2025లో పదో సారి సీఎం గద్దెనెక్కి.. దశవతారంలో ప్రత్యక్షమవ్వటానికి.. తన రాజకీయ చతురాయుధానికి పదును పెడుతున్నారు.ఇంతకీ ఆయన ఎవరో కాదు.. 74 ఏళ్ల భక్తిపూర్ కుర్మీ మున్నా.. నితీశ్ కుమార్ (Nitish Kumar).
ఈ బీహార్ శ్రీకృష్ణుడు ఎమర్జెన్సీ కాలంలో రాజకీయారంగ్రేటం చేశాడు. అప్పుడు ఇతడి వయస్సు జస్ట్ 26 ఏళ్లు. రాజకీయాల్లో తొలి ప్రయత్నంలోనే ఫెయిల్ అయ్యారు. హర్నాట్ నియోజకవర్గంలో జనతాపార్టీ (Janata Party) అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1985 ఎన్నికలు నితీశ్ కుమార్ స్థితి గతిని మార్చేశాయి. లోక్‌దళ్ పార్టీ (Lok Dal Party) అభ్యర్థిగా విజయం సాధించారు. అక్కడి నుంచి… ఇక నితీశ్ కుమార్ అసలు పొలిటిషన్ రూపం మారిపోయింది. 1989లో బార్త్ ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టాడు. 2004 వరకూ ఆరు సార్లు ఎంపీ గెలిచారు. ఉపరితల రవాణ, రైల్వేస్, వ్యవసాయ శాఖ కేబినేట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2000 లో బీహార్ సీఎం అయ్యే యోగం లభించింది. కానీ.. ఆ పదవి కాలం ఏడు రోజులకు మించలేదు. ఇక 2005లో సీఎంగా ప్రమాణం చేసిన ఈ నితీశ్ కుమార్.. ఇప్పటికి తొమ్మిదిసార్లు ఆయనే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
అన్ని కంటే.. ఆయన తొమ్మిది సార్లు సీఎంగా ప్రమాణం చేయటం ఒక ఎత్తు కాగ.. బీహారీల మదిలో ఎలా స్థిరపడ్డారో? కారణాలేంటీ? ఆయన 100,000 మందికి పైగా సర్కారీ టీచర్లను నియమించారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లను పెంచారు. పల్లెల్లో విద్యుత్తు వెలుగులు నింపారు. రోడ్లు వేశారు, మహిళ్లల్లో అక్షరాస్యత శాతం పెంచారు. నేరస్థులపై ఉక్కుపాదం మోపారు. నేరాలు, ఘోరాలపై కఠినంగా వ్యవహరించారు. చట్టబద్ధ రాష్ట్రంగా బీహార్ ను తీర్చిదిద్దారు. అవినీతికి గట్లు వేశారు. సగటు బిహారీ ఆదాయం డబుల్ రేంజీకి వెళ్లింది. ఇంత చేసినా… నితీష్ కుమార్ రాజకీయ వైఖరిపై విమర్శల జడివాన కురుస్తూనే ఉంది. బీహార్ రాజకీయ (Bihar Politics) చిత్ర పటంలో.. ప్రజాస్వామ్యం ఓ బేల. పెత్తందారి ధన బలం..అసుర బలగం ఆధిపత్యానిదే అంతిమ తీర్పు. భారతావనికి స్వాంతత్ర్యం రాక ముందే 1946లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections) జరిగాయి. ఆ తరువాత 1952 నుంచి .. బీహార్ రాజకీయ ప్రస్తావనంలో.. అనేక సార్లు ప్రజాస్వామ్యానికి పరాభవం తప్పదు.
1969 నుంచి 2005 వరకూ ఎప్పుడు రాష్ట్రపతి పాలన (President’s Rule) విధిస్తారో.. బీహారీలకు తెలీదు. 1961 నుంచి ఎప్పుడు ఎవరు సీఎం అవుతారు? ఎన్నాళ్లు సీఎం పదవిలో ఉంటారు? ఎవరి పీఠాన్ని ఎవరు కూల్చుతారు? ఏ కులాధినేత సీఎం అవుతాడు? 64 ఏళ్లు అస్థిర పాలనలో .. కొట్టుమిట్టాడిన బీహారీలు.. 2015 నుంచి సుస్థిర పాలనలో ప్రశాంత జీవనం గడుపుతున్న మాట వాస్తవం. తాజాగా.. దొంగ ఓట్ల చోరీ… విదేశీ దొంగ ఓటర్ల నినాదంతో.. అటు ఇండియా కూటమి.. ఇటు ఎన్డీయే జగడం ఊపందుకున్న నేపథ్యంలో.. బీహారీ సీఎం నితీశ్ కుమార్ (Bihari CM Nitish Kumar) వ్యూహం ఏంటీ? ఎత్తుగడ ఏంటీ? 2000 నుంచి ఇప్పటి వరకూ ఆయన సీఎంగా కొనసాగటానికి ఏ పథకాలు రచించారు? అనుసరించారో? ఒక్కసారి పరిశీలిద్దాం.
అతిథి పాత్రలో..
1996లో పశుగ్రాసం కుంభకోణం ఆరోపణలో జనతాదళ్ నుంచి బయటకు వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav).. రాష్ట్రీయ జనతాదళ్ నెలకొల్పారు. తన స్థానంలో తన సతీమణి రబ్రీదేవీని సీఎంగా ప్రకటించారు. ఆమె 2000 వరకూ పాలించారు. ఇక 1999లో ఎంపీగా గెలిచిన నితీశ్ కుమార్ కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2000 మార్చిలో జరిగిన ఎన్నికల్లో .. ఏ కూటమికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే మేజిక్ ఫిగర్ రాలేదు. ఎన్డీయే కూటమికి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా, లాలూ ప్రసాద్ యాదవ్‌కు కూటమికి 159 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
మేజిక్ ఫిగర్ 163 కు లాలూ ప్రసాద్ నాలుగు స్థానాలు, ఎన్డీయే కూటమి 12 స్థానాల్లో వెనుకపడ్డాయి. తొలుత ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయేను గవర్నర్ ఆహ్వానించారు. సరీగా అప్పుడే.. అటల్ బిహారీ వాజ్ పేయి హితుడు నితీశ్ కుమార్ తెరమీదకు వచ్చాడు. 67 మంది ఎమ్మెల్యేల బలాన్ని బీజేపీ త్యాగం చేసింది. తమలో సగం బలశాలి 34 ఎమ్మెల్యేల సమతాపార్టీకే సీఎం పదవిని ఆఫర్ ఇచ్చింది. ఇంకేముందీ 2003 మార్చిన బీహార్ 22వ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో బల ప్రదర్శనకు గవర్నర్ వారం రోజుల గడువు ఇచ్చారు. కానీ బలప్రదర్శనలో నితీశ్ కుమార్ కు ఓటమి తప్పలేదు.
మార్చి 10 రాజీనామా చేశారు. యధావిధిగా కేంద్ర మంత్రిగా తన బాధ్యతలు కొనసాగించారు. కానీ.. బీహార్ సీఎం కావటమే లక్ష్యంగా.. ఆయన రాజకీయ పావులు కదుపుతూనే ఉన్నారు.
2005 నుంచి దశ తిరిగింది
2005 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో విజయంతో నితీశ్ కుమార్ దశ తిరిగింది. ఓబీసీ కుర్మి నేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లాలు హయాంలో, వెనుకబడిన కులాల అభ్యర్థులు బీహార్ అసెంబ్లీలో ఆధిపత్యం చెలాయించారు, అందులో సగం సీట్లను పొందారు .ఈ శక్తివంత సామాజిక సమాజం ఆకాంక్షతో ఓబీసీల మధ్య ఘర్షణకు దారితీసింది, సామాజిక న్యాయం, అభివృద్ధి నినాదంతో బీహార్ లో నితీశ్ కుమార్ తన రాజకీయ పునాదిని పటిష్టపర్చారు. నితీశ్ కుమార్ సంక్షేమాస్త్రం ఫలించింది. బాలికలకు సైకిళ్ళు, స్కూళ్లల్లో భోజనం అమలుతో భారీ సంఖ్యలో బాలికలు పాఠశాలల్లో చేరారు. సర్కారీ స్కూళ్లల్లో డ్రాపౌట్స్ సంఖ్య తగ్గింది.
2010 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చింది. నితీశ్ కుమార్ మళ్ళీ సీఎం అయ్యారు. ఎన్డీయే కూటమి 206 సీట్లు గెలుచుకోగా, ఆర్జేడీ 22 సీట్లకు పరిమితమైంది. బీహార్ చరిత్రలోనే తొలిసారిగా మహిళలు , యువ ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేశారు, రక్తపాతం లేదు. హింస లేదు. ప్రశాంత ఎన్నికలు జరిగాయి. కానీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో నితీశ్ కుమార్ చరిశ్మ తేలిపోయింది. ఈ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నికల్లో తన పార్టీ పేలవ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ నితీశ్ కుమార్, మే 17, 2014న రాజీనామా చేశారు. ఇక తొలిసారిగా బీజేపీ సీఎం బీహార్ లో తెరమీదకు వచ్చారు. జితన్ రామ్ మాంఝీ బాధ్యతలు స్వీకరించారు.
కొన్ని గంటల్లోనే.. ప్లేటు ఫిరాయింపు
బీజేపీ సహచర్యంలో సీఎం పదవిని ఎంజాయ్ చేసిన నితీశ్ కుమార్ ప్లేట్ ఫిరాయించారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీని ఎదుర్కోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూతో మహాఘటబంధన్ ఏర్పాటు చేశారు. నరేంద్ర మోదీ, బీజేపీ లేవనెత్తిన ఆరోపణలను తిప్పికొడుతూ, మహా కూటమి తరపున ఎన్నికల సమయంలో నితీశ్ కుమార్ దూకుడుగా ప్రచారం చేశారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని చిత్తు చేశారు. 178 సీట్లతో మహాఘట్బంధన్ ఘన విజయం సాధించింది, ఆర్జేడీ 80 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది జేడీయూ 71 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. 2015 నవంబర్ 20 న ఐదవసారి సీఎంగా నితీశ్ కుమార్క్ ప్రమాణ స్వీకారం చేశారు తేజస్వి యాదవ్ బీహార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు . ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పై అవినీతి ఆరోపణలు రావటంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీఎం నితీశ్ కుమార్ కోరారు. రాష్ట్రీయ జనతా దళ్ అందుకు నిరాకరించింది, అంతే నితీశ్ కుమార్ జూలై 26, 2017న రాజీనామా చేశారు, అంతే మహా కూటమి కథ రాజీనామాతో ముగిసింది. నితీశ్ కుమార్ యథప్రకారం మళ్లీ ప్లేటు ఫిరాయించి ప్రధాన ప్రతిపక్షం ఎన్డీయేలో చేరారు. కొన్ని గంటల్లోనే మళ్లీ సీఎం పదవిని అలంకంరించారు.
ఇలా ఎన్డీయేలోకి వెళ్లి…
2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీహార్ ప్రజలు రెండు కూటములకు అధికారం ఇవ్వలేదు. మహాఘట్‌బంధన్ కు 110 సీట్లు లభిస్తే ఎన్డీయే కూటమికి 125 సీట్లు వచ్చాయి. అతి పెద్ద కూటమిగా గుర్తించి ఎన్డీయే కూటమికి సర్కారు ఏర్పాటు చేసే అవకాశాన్ని గవర్నర్ ఇచ్చారు. ఇక మహాఘట్బంధన్ అధికారానికి దూరమైంది. ఇక నితీశ్ కుమార్ ఏడవసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 8, 2020న, రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో రాజ్యసభ సీటు ఖాళీ కావటంతో బీహార్ నుంచి సుశీల్ కుమార్ మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 9 2022 ఆగస్టు 9న నితీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్డీయే నుంచి తమ పార్టీ వైదొలిగిందని, మహాఘట్బంధన్‌లో తిరిగి చేరిందని, ఆర్జేడీ. కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 10న ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మహాఘట్బంధన్ కు టాటా
2024 జనవరి 28 న నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆర్జేడీ, కాంగ్రెస్‌తో మహాఘట్బంధన్ అనుబంధం తెంచుకున్నారు. ఎన్డీయే కూటమిలో తిరిగి చేరారు, అదే రోజున, ఆయన 24 ఏళ్లల్లో తొమ్మిదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడే.. బీహార్ లో రాజకీయ సంక్షేభానికి తెరలేసింది. నితీశ్ కుమార్ కు పాల్త్ రామ్ అనే బిరుదు దక్కింది. ఇక ఈ ఎన్నికల్లో నితీశ్ కుమార్ ను బీహారీ ప్రజలు ఏరీతిలో గౌరవిస్తారో? ఫిర్ సే ఏక్ బార్ హో.. బీహార్ మే బహర్ హో, ఫిర్ సే ఏక్ బార్ హో నితీష్ కుమార్ హో అని 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం నితీష్ కుమార్ ఆలపించిన పాటను జనం గుర్తు చేసుకుంటారా? ఆదరిస్తారా? తిరస్కరిస్తారా? వేచి చూద్దాం.