8MarSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

8MarSunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

8MarSunday2026
8MarSunday2026

ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్ర‌భ‌ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.. 
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.

8MarSunday2026 |ఈ సంచికలో…

1. మహిళల మనశ్శాంతికి ధ్యాన మార్గం చూపుతున్న పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు(ముఖచిత్ర కథనం)

2. కబుర్లు (శీర్షిక)

3. సన్నిహితం(శీర్షిక)

4. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

5. వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-

మహిళల మనశ్శాంతికి ధ్యాన మార్గం చూపుతున్న పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు

మహిళల మానసిక ఆరోగ్యానికి ధ్యానం ఎందుకు అవసరం?
సుషుమ్న క్రియాయోగం – ఆధ్యాత్మిక ధ్యానంలో ప్రత్యేక సాధన
లక్షలాది మందికి ఉచిత ధ్యాన విద్య
మహావతార్ బాబాజీ ఆశీర్వాదంతో ప్రారంభమైన ధ్యాన మార్గం
సమాజ శ్రేయస్సే అమ్మగారి ధ్యేయం
ప్రపంచవ్యాప్తంగా సుషుమ్న క్రియా యోగ కార్యక్రమాలు

ఉరుకుల పరుగుల జీవితంలో, ఒక పక్క ఉద్యోగాలు చేస్తూ కూడా, ఇంటిని, పిల్లలను, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలగాలి అంటే నేటి మహిళలకు మనశ్శాంతి కావాలి. మానసిక శాంతిని అందించగలిగే మార్గం ధ్యానమని, మహిళల సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడే అద్భుతమైన, సులభతరమైన ధ్యాన ప్రక్రియను లోకానికి అందించారు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు.

8MarSunday2026
8MarSunday2026

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో లక్షలాదిమంది మహిళలకు మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తూ, ధ్యాన మార్గం ద్వారా వారిలోని ఒత్తిడి, ఆందోళన, అశాంతి వంటి సమస్యలను తగ్గిస్తూ, జీవితంలో అన్నీ కోల్పాయాం, ఇక మరణమే శరణమని నిర్ణయించుకున్న వారికి సైతం అపార విశ్వాసం కలిగిస్తోన్న గొప్ప ఆధ్యాత్మిక వేత్త, పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు.

అమ్మగారు ధ్యాన ప్రచారాన్ని ఒక సేవగా చేసుకొని, ఉచితంగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకరు సాధన మొదలు పెట్టిన తరువాత, వారి బాగోగులు గమనిస్తూ, వారి సమస్యలు వింటూ, వారు జీవితంలో స్వాంతన పొందేంత వరకు కూడా ఉచిత నిర్దేశాన్ని చేస్తారు అమ్మగారి శిష్యులు. అలాగే ఏ సందేహాలు ఉన్నా అందరికీ సమాధానాలు ఇస్తూ, వారి శ్రేయస్సుకు నిరంతరం పరిశ్రమిస్తున్నారు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు. ప్రపంచమంతా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలి అంటే, కుటుంబ శ్రేయస్సును కాంక్షించే మహిళల మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని అంటారు అమ్మగారు. గత 20 సంవత్సరాలుగా లక్షలాది మందికి ఉచితంగా ధ్యాన విద్యను అందించి, వారి మనో వికాసానికి దోహదం చేస్తున్నారు అమ్మగారు.

అమ్మగారు చెప్పిన మాట విని ధ్యానం క్రమం తప్పకుండా చేసి, నేడు అనేక రంగాల్లో రాణిస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. డాక్టర్లు, పోలీసులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, క్రీడాకారులు, కళాకారులు, న్యాయవేత్తలు, గృహిణులు.. ఇలా ఎందరో.

భారత దేశం ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి. ఈ పవిత్ర భూమిపై ఎందరో యోగులు జన్మించారు. సమాజహితం కోసం అందరినీ ధ్యాన మార్గంలో నడిపించేందుకు జన్మించిన కారణ జన్ములు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు. ఉన్నత కుటుంబంలో సత్ సంస్కృతీ, సంప్రదాయాల మధ్య పెరిగారు అమ్మగారు. బాల్యంలో ఎక్కువగా మౌనంలో ఉండేవారు. అమ్మగారు సైకాలజీలో ఉన్నత విద్యను అభ్యసించారు.

అది 2005 వ సంవత్సరం, ప్రతీ రోజు బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయడం అమ్మగారికి అలవాటు. ఆ ప్రకారమే, ఉదయమే లేచి ధ్యానం మొదలు పెట్టారు. ధ్యానంలో ఇద్దరు మహా గురువులు అమ్మగారికి దర్శనం ఇచ్చారు. ఒకరు యుక్త వయస్కులైన మహావతార్ బాబాజీ గారు, మరొకరు ఋషి రూపంలో ఉన్న భోగ సిద్ధర్ గారు. మహావతార్ బాబాజీ గారు, షిర్డీ సాయినాథులకు, ఆది శంకరాచార్యులకు, కబీర్ దాస్ గారికి, లాహిరి మహాశయ, యుక్తేశ్వర్ గిరి వంటి ఎందరో మహనీయులకు క్రియా యోగ దీక్షా గురువులు. శ్రీ మహావతార్ బాబాజీ గారి గురుదేవులే శ్రీ భోగ సిద్ధర్ గారు. వారు 18 సిద్ధుల్లో ఒకరు.

పళనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాన్ని నవ పాషాణాతో తయారు చేసిన సిద్ధులు. ఈ మహా గురువులిద్దరూ, “సుషుమ్న క్రియాయోగ” అనే మహత్తరమైన ప్రక్రియను అమ్మగారికి అందించి, “ఇది మేము మానవాళికి నీ ద్వారా అందించే బహుమానం. విస్తృతంగా ఈ ప్రక్రియను అందరికీ అందించు, మేము నీ వెన్నంటి ఉంటాము” అని తెలియజేశారు. ఆ నాటి నుండి అమ్మగారు సుషుమ్న క్రియా యోగ ధ్యానాన్ని లక్షలాది మందికి అందిస్తూ ఉన్నారు.

సుషుమ్న క్రియా యోగాన్ని చాలా సులువుగా ప్రతీ ఒక్కరూ సాధన చేయగలరు. ఇందులో కఠోర నియమాలు ఏమీ లేవు. ప్రతీ రోజు కేవలం 21 నిమిషాల నుండి 49 నిమిషాల పాటు సాధన చేయడం వల్ల అసంఖ్యాకమైన ప్రయోజనాలు కలుగుతాయి. ప్రఖ్యాత అమెరికా వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు గారు, “క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా నివారించగల అద్భుత ప్రక్రియ-సుషుమ్న క్రియా యోగం” అని అన్నారు.

పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారి నిర్దేశంతో దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ స్థాపించబడింది. ఈ సంస్థ ద్వారా అమ్మగారు, భారత దేశంలో పల్లెల నుండి పట్టణాల వరకు, అలాగే ప్రపంచదేశాల్లో కూడా ఉచిత ధ్యాన కార్యక్రమాలు, ఉచిత ధ్యాన శిబిరాలు నిర్వహించడంతో పాటు, గర్భిణీ స్త్రీలకు మంచి సంతానం కోసం సుషుమ్న గర్భ సంస్కార్, బాల బాలికలకు భారతీయ సంస్కృతీ సంప్రదాయ విలువలను అందించే సుషుమ్న శిక్షణ వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అమ్మగారి శిష్యులే సేవకులుగా మారి సమాజంలో మంచిని నెల్కొల్పడం కోసం కృషి చేస్తున్నారు. విశ్వంలోని ప్రాణి కోటి సంక్షేమమే అమ్మగారి ధ్యేయం.

నేటి యువతరానికి భారతీయ సనాతన ధర్మంలోని సత్యాలు అర్థమయ్యే రీతిలో, చాలా సరళంగా వివరిస్తారు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు. అమ్మగారివి కఠినమైన కాన్సెప్ట్స్ కాదు, కాన్సైజ్ అండ్ క్లియర్ ట్రూత్స్. అందుకే అమ్మగారి సందేశాలు సూటిగా లక్షలాది మంది హృదయాలను కదిలిస్తున్నాయి.

ప్రతీ సంవత్సరం పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు, దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ ద్వారా 3 విశిష్ట కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఫెబ్రవరి మాసంలో మహా శివరాత్రి సందర్భంగా వేలాది మంది పాల్గొంటారు. ఆ రోజు మహా లింగోద్భవ ధ్యానంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుండి సుషుమ్న క్రియా యోగులు వస్తారు.

జూన్/ జూలై మాసంలో గురు పౌర్ణమి సందర్భంగా అమ్మగారు విశ్వ శాంతి యజ్ఞం నిర్వహిస్తారు. ఈ మహా యజ్ఞం శ్రీ మహావతార్ బాబాజీ గారి సూచన మేరకు జరుగుతుంది.

నవంబర్ మాసంలో కార్తీక పౌర్ణమి మహోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటారు సుషుమ్న క్రియా యోగులు. ఈ కార్యక్రమానికి కూడా వేలాదిగా సాధకులు అమ్మగారితో ధ్యాన సాధన చేసేందుకు దేశ దేశాల నుండి వస్తారు.

పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు చేస్తున్న అశేష కృషికి, సేవకు అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశాల్లో ప్రత్యేక సత్కారాలు జరిగాయి. సమాజ శ్రేయస్సు కోసమే పూర్తిగా తమ జీవితాన్ని అంకితం చేసిన మహా గురువులు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు.

శ్రీ భోగ సిద్ధర్ గారు, శ్రీ మహావతార్ బాబాజీ గారు అందించిన పవిత్రమైన సుషుమ్న క్రియా యోగ సాధనను భావి తరాలకు అందించడం కోసం అమ్మగారు ఎంతో కృషి చేస్తున్నారు. ఒత్తిడి కారణంగా ఆత్మ హత్యలు, అనారోగ్య సమస్యల బారిన పడకుండా, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అమ్మగారు.

ఫౌండేషన్ ద్వారా ప్రతీ ఒక్కరూ సాధన చేసేందుకు వీలుగా, చక్కటి ప్రకృతి ఆవరణలో ధ్యాన మందిరాల నిర్మాణాన్ని కూడా చేపట్టారు. అమ్మగారి సేవ అత్యంత ఆదర్శవంతం, తెలుగు వారందరికీ గర్వకారణం.

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

2 కబుర్లు (శీర్షిక)

DEC 2025

మట్టి దీపం – మంటల సెగ

ఆ ఊరి సరిహద్దులో రెండు పెద్ద కొండలు. ఆ కొండల మధ్య ఒక చిన్న లోయ. అక్కడ ఒక పాత ఇల్లు.

ఆ ఇంట్లో ఒక ముసలమ్మ తన మనవడితో కలిసి నివసించేది. ఆ దేశంలో యుద్ధం మొదలైంది. ప్రతిరోజూ ఆకాశంలో యుద్ధ విమానాల హోరు, ఎక్కడో దూరంగా బాంబుల పేలుళ్లు వినిపించేవి.

ఒక సాయంత్రం, మనవడు భయపడుతూ అడిగాడు, “అమ్మమ్మా! ఆకాశంలో నక్షత్రాల కంటే ఎక్కువగా మంటలు కనిపిస్తున్నాయి. ఆ మంటలు మనల్ని కూడా కాల్చేస్తాయా?”

ముసలమ్మ నిశ్శబ్దంగా ఒక మట్టి ప్రమిదను వెలిగించి కిటికీ దగ్గర పెట్టింది. ఆమె ఇలా అంది:

“చూడు నాయనా, మంటల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి అహంకారంతో రగిలే మంట—అది ఇళ్లను, దేశాలను బూడిద చేస్తుంది. రెండోది ఆశతో వెలిగే దీపం—అది చీకటిని తరిమి దారి చూపిస్తుంది.”

“కానీ అమ్మమ్మా, ఇంత చిన్న దీపం ఆ పెద్ద యుద్ధాన్ని ఆపగలదా?” మనవడు అమాయకంగా అడిగాడు.

ముసలమ్మ నవ్వి ఇలా చెప్పింది:

“యుద్ధం చేసేవాళ్ళు పరాయివారి భూమిని గెలవాలని చూస్తారు. కానీ శాంతిని కోరుకునేవాళ్ళు మనుషుల మనసులను గెలవాలని చూస్తారు. ఈ చిన్న దీపం యుద్ధాన్ని ఆపలేకపోవచ్చు, కానీ నీ మనసులో భయం అనే చీకటిని పోగొట్టి, మనం ఇంకా బ్రతికే ఉన్నామనే ధైర్యాన్ని ఇస్తుంది. ప్రపంచంలో ఏ యుద్ధమైనా ఆఖరికి ఆగిపోవాల్సిందే… కానీ ఆ యుద్ధం మిగిల్చిన గాయాలు మానాలంటే మళ్ళీ మనుషుల మధ్య ప్రేమ అనే వెలుగు అవసరం.”

ఆ రాత్రి ఆ బాంబుల వెలుతురు కంటే, ఆ చిన్న ప్రమిద వెలుతురే ఆ పిల్లాడికి ఎంతో హాయిని ఇచ్చింది.

యుద్ధం వల్ల గెలిచేది ఎవరూ ఉండరు; ఓడిపోయేది మాత్రం మానవత్వం. ఆయుధాల ధ్వని కంటే శాంతి కోసం చేసే ప్రార్థన బలమైనది. ద్వేషం కేవలం వినాశనాన్ని తెస్తుంది, కానీ సహనం, అవగాహన మాత్రమే ప్రపంచాన్ని నిలబెడతాయి. యుద్ధం అనేది కేవలం వార్తల్లో కనిపించే అంకెలు మాత్రమే కాదు, అది ఎంతోమంది సామాన్యుల జీవితాలను, కలలను ప్రభావితం చేసే ఒక విషాదం. ఇలాంటి సమయాల్లో మనుషుల మధ్య ఉండాల్సింది సహానుభూతి, శాంతి పట్ల విశ్వాసం.


———————————————————————-


3.సన్నిహితం… శీర్షిక

DEC 2025

ఒక్కసారి మాట్లాడి చూడు

సాధారణంగా మన చుట్టూ ఉన్న వ్యక్తుల మీద మనకు ఒక అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. ఇది ఆ వ్యక్తులతో మనకు ఉన్న పరిచయం వల్ల లేదా అబ్జర్వేషన్ వల్ల ఏర్పడి ఉంటుంది. ఇది మనందరికీ సర్వసాధారణం. అయితే కొత్త వ్యక్తుల మీద మనకు మన సొంత అభిప్రాయం ఉండదు. వాళ్లూ వీళ్ళు చెప్పిన అభిప్రాయం తప్ప.

అయితే ఆ అభిప్రాయం కరెక్ట్ కావచ్చు లేదా తప్పు కావచ్చు. ఇలాంటి అనుభవమే నాకు ఒకటి జరిగింది. నేను అభిమానించే ఒక రచయిత చాలా పరుషంగా మాట్లాడతారు అని, అహంభావి అని అందరూ చెప్పేవారు. నేను కూడా అది నిజమే అనుకునే వాడ్ని. కానీ ఆయనతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆ అభిప్రాయం తప్పు అని తెలుసుకున్నాను.

తన అనుభవాల దృష్ట్యా కొత్త వాళ్ళతో అలా ఉంటారని అర్థం చేసుకున్నాను. అలాగే నా కింద పని చేయడానికి కొత్తగా వచ్చే కుర్రాళ్ల గురించి కూడా వేరే వాళ్ళు నెగెటివ్ గా చెప్పినపుడు నేను వెంటనే నమ్మకుండా వాళ్ళను పిలిచి కాసేపు మాట్లాడతాను. అప్పుడు నా అభిప్రాయం తప్పు అని తెలుస్తుంది.

అలాగే మన బంధువుల్లో కొంత మంది మంచివాళ్ళు కారు అని ఎవరైనా చెప్పినా వాళ్ళతో ఒకసారి మాట్లాడాకే వాళ్ళ మనస్తత్వాన్ని నిర్థారించుకుంటాను . ఇలా మనం కనీసం ఒకసారి అయినా వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళ అసలు మనస్తత్వం తెలుస్తుంది.

వారిపై సరైన అభిప్రాయం కలుగుతుంది . కేవలం వేరే వాళ్ళ మాటలు విని వాళ్ళ మెంటాలిటీ ను ఊహించుకుంటే కమ్యూనికేషన్ గేప్ వల్ల తప్పుడు అభిప్రాయం కలిగే అవకాశం ఉంది . అంతే కదా ఫ్రెండ్స్ !!!!

====================================

4. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

మాతృస్వామ్యం
(మహిళా దినోత్సవం ప్రత్యేకం)

Patriarchy, Matriarchy ఏది అవసరం ఈ మానవ సమాజానికి?! అసలు ఏది సహజం! మాతృస్వామ్యం, పితృస్వామ్యం ఏది మానవ జీవితాలకు కావాలి! కాలం, సందర్భం, అవసరం, అవకాశం వీటి బట్టి మారాలా? ఇప్పుడు మన భూమిపై ఎక్కువ చోట్ల ఏ వ్యవస్థ నడుస్తోంది?!

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా: అన్నారు కదా! ఈ మాట మన భారతీయ సమాజం నమ్ముతుంది! కానీ అది నిజంగా జరుగుతోందా?

ఏ వ్యవస్థ ఉందో అర్ధం కావాలి అంటే, పని స్థలాల దగ్గరకు వెళ్ళాలి! పారిశ్రామిక రంగం, సినిమా రంగం, రాజకీయం…అక్కడ ఎవరి ఆధిపత్యం నడుస్తోంది? ఎవరికి సంపాదన ఎక్కువ? జీతం! డబ్బు! గౌరవం! అతిథి మర్యాదలు, రాజభోగాలు ఎవరికి ఎక్కువ దక్కుతున్నాయి! ఎవరి మాట నెగ్గుతోంది? సత్యం చూడాలి!

ఎక్కువ చోట్ల మగవారికే పెద్ద పీట వేస్తున్నారు! జగద్వితం!

కొన్ని చోట్ల మహిళల ఆధిపత్యం ఉన్నా, అది వారి వ్యక్తిగత ప్రతిభ! లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితులు కారణం!

వ్యవస్థకు రాజముద్ర ముందు మన మనస్సుల్లో పడాలి! తర్వాత అది బాహ్య ప్రపంచంలో రూపం తీసుకుంటుంది! అఫ్ఘానిస్థాన్, ఇరాన్, సౌదీ లాంటి దేశాల్లో పరిస్థితులు మనకు తెలుసు! షియా, సున్నీ ముస్లింలు ఎవరు ఉన్నా అక్కడ మహిళలకు నిజంగా దక్కుతున్న గౌరవం, హక్కులు అక్కడ సమాజం చర్చించుకోవాలి! బురఖా దగ్గర నుంచి, తలాక్ తలాక్ వరకు! ప్రస్తుతం అయితే ఒక యుద్ధమే అక్కడ జరుగుతోంది! అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం! ఇది ఎటు తెగుతుందో? చివరకు ఎవరు మిగులుతారో కొన్ని రోజుల్లో తేలిపోతుంది!

ఇంత ఆధునిక యుగంలో కూడా యుద్ధం అనివార్యం అయ్యింది అంటే, అది మానవ జాతికి ఎంత అవమానం?!

నేడు నడుస్తున్నది నాగరిక సమాజమా?! లేక అనాగరిక సమజామా?! ఇంకో లక్ష ఏళ్ల తర్వాత నిజమైన నాగరిక సమాజం ఏర్పడుతుందా? పోనీ ఇంకో ఐదు వందల ఏళ్ళు పడుతుందా? మతం మత్తు, ప్రాంతాల ఎత్తులు, అహంకారం కత్తులు…. ఎప్పుడు చల్లబడతాయో! చూస్తున్న వాస్తవాలు మనల్ని నిరాశ నిస్పృహలకు గురి చేస్తున్నాయి!

ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇక పై చెల్లదు! అని మహాకవి రాసి 90 ఏళ్ళు అయ్యింది!

బలహీనులపై బలవంతుల పెత్తనం! మహిళ బలహీనురాలు కాబట్టి, పురుషుడు పెత్తనం!

“పాఠం అప్పచెప్పకపోతే పెళ్లి చేస్తాను అని పంతులు గారు అన్నప్పుడే భయమేసింది, ఆఫీసులో నీ మొగుడు ఉంటాడు అవసరం వచ్చినా శెలవు ఇవ్వడు, వాడికేం మగమహారాజు అని ఆడా మగా వాగినప్పుడే అర్ధం అయిపోయింది! పెళ్లి అంటే నూరేళ్ళ శిక్ష అని, మొగుడు అంటే స్వేచ్ఛా భక్షకుడు అని! మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు అని!” సావిత్రి అనే గొప్ప రచయిత్రి 45 ఏళ్ల క్రితం బందిపోట్లు అనే చిన్న కవిత రాసి తెలుగు రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టి చేసింది! స్త్రీవాద కవిత్వం, ఫెమినిస్ట్, ఫెమినిజం అన్నారు! అప్పటికే వెస్ట్ లో ఈ పదం మారుమ్రోగుతోంది!

తెలుగులో సౌందర్యాత్మక హింస, లేబర్ రూమ్, A call girl’s Monologue, పైటను తగిలేయాలి…అంటూ, విమల, కొండేపూడి నిర్మల, ఘంటసాల నిర్మల, జయప్రభ….మొదలైన రచయిత్రులు (రచయితలు) ఎన్నో కవితలు, గేయాలు రాశారు! త్రిపురనేని శ్రీనివాస్(చనిపోయాడు) లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేశారు! జ్వాలాముఖి లాంటి వాళ్ళు విభేదించారు! అవి అన్నీ వైయక్తిక సమస్యలు అని కొట్టి పడేశారు!

పురుషుడు కూడా ఈ పితృస్వామ్య వ్యవస్థ వల్ల బాధితుడే అని వాదించారు! ఎందుకంటే మగాడు ఏడవకూడదు, ఎంత కష్టం వచ్చినా ఆడదానిలా(!??) కన్నీళ్లు పెట్టకూడదు! ఇలా కొన్ని అసహజ tablue లు, నమూనాలు …. పితృస్వామ్య వ్యవస్థ సృష్టి చేసి లోకం మీద రుద్దింది! అందులో పడి పురుషుడు కూడా విల విల లాడుతున్నాడు అని ఎన్నో వాదనలు! ఇందులో చాలా నిజాలు ఉన్నాయి!

నేడు వివాహ వ్యవస్థ 80 శాతం కుప్పకూలి పోయి ఉంది! చట్టం రక్షణతో ఒక వ్యవస్థ ఎన్నాళ్లు నిలబడుతుంది?

అసలు మనుషులు మొనోగోమియస్(Monogamous) ఏనిమల్స్ కాదు! Human’s are Polygamous animals అనే ప్రకృతి వాస్తవాన్ని మానవ సమాజం మర్చిపోయింది! What is the nature instict? Or Natural instinct? దానిని అర్థం చేసుకోవాలి! గుడ్డిగా వ్యతిరేకించడమా? ప్రకృతి సహజాతలను అర్థం చేసుకోవడంలో మానవ సమాజం ఎంత విజయం సాధించింది అనేది ఆరోగ్య కరమైన చర్చ!

వివాహం వేరే గత్యంతరం లేక మానవ జాతిపై రుద్ద బడింది! దానికి దేవుడు, మతం, వ్రతాలు, పురాణ కథలు, పురాణ పురుషులు…, పాతివ్రత్యం, … కొంత చరిత్ర, కొన్ని జానపద కట్టు కథలు అన్ని దేశాల వాజ్మయంలో పుట్టు కొచ్చాయి!

లోకంలో ఏ వ్యవస్థ రాజ్యం చేస్తోందో చూడాలి అంటే, పని సంబంధాలు(work relations), లేదా శృంగార సంబంధాలు(Sex relationships) వీటి దగ్గర నిజాలు కనబడతాయి! పైకి కనిపించే నటన కాదు, వాస్తవంగా అసలు ఏం జరుగుతోందో చూడాలి అంటే గుండె ధైర్యం ఉండాలి!

గుండె ఆగిపోయే నిజాలు చూసే, అర్థం చేసుకునే చైతన్యం ఉండాలి.

“కడుపు దహించుకుపోయే పడుపుకత్తె రాక్షస రతిలో అర్థ నిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి ….” మహాకవి మాటలు ఆత్మ లోతుల్లోంచి చూడాలి!

పిల్లలు కోసం కలిసి ఉన్నట్టు నటిస్తూ, లోకాన్ని మభ్య పెడుతూ…, ఎవరి అక్రమ, సక్రమ సంబంధాలలో వారు కొనసాగుతున్నారు! ఏది సక్రమం, ఏది అక్రమం అని జడ్జి చేయడానికి మనం ఎవరు అని ప్రశ్నలు! ఇక్కడ బాధితుల కోణం, బాధ పెడుతున్న వారి కోణం, ఎవరి వైపు ధర్మం ఉందో చెప్పడం పెద్ద కష్టం కాదు! ఆ ప్రత్యేక పరిస్థితే సమాధానాలు ఇస్తుంది! లేదు ఒక గవర్నమెంట్ పాలసీ, చట్టం, Law of the land అనేది ఒక పారామీటర్!

పెళ్లి అయిన రెండో రోజే, నువ్వెంత అంటే నువ్వెంత అని మాటా మాటా పెరిగి, సూర్యాస్తమయం లోపే విడిపోతున్న జంటలు ఎందరో నేడు! ఆస్తి, ఐశ్వర్యం, లేదా గత్యంతరం లేని పరిస్థితులు వల్ల కొందరు కలిసి ఉంటున్నారు! లేదా భార్యాభర్తలు అని ఒక నటన చేస్తున్నారు! నిజమైన ప్రేమ కోసం, ధర్మం కోసం నిజాయితీగా ఉన్నవారు అతి తక్కువ!

మాతృస్వామ్యం, పితృస్వామ్యం రెండు బ్యాలెన్స్ కావాలి! గాలి, నీరు, తిండి అంత అత్యవసరం శృంగారం కూడా అనే నిజం లోకం బహిరంగంగా అంగీకరించాలి!

లైంగిక వాంఛను, ఆకర్షణను అపురూపంగా, ఆరాధనతో, గౌరవంతో, ప్రకృతి ఆశీర్వాదంగా చూసే మానసిక వికాసం మనుషుల్లో కలగాలి!

మహా ప్రవాహం, సునామీ వచ్చినప్పుడు కట్టుబాట్ల ఆనకట్టలు కొట్టుకు పోతాయి! మనుషుల రక్తం ఒక మహా సముద్రం, వంద సునామీలు సృష్టి అక్కడ జరుగుతుంది! పైకి అంతా బాగున్నట్టు ప్రశాంతంగా కనిపిస్తుంది! కానీ మనుషుల మనసుల్లో జరిగే ఘర్షణ, నిశ్శబ్ద యుద్ధం చరిత్రను మారుస్తాయి! ఆ మౌనంలో వంద యుద్ధాలు ఉంటాయి!

అన్నవు రాశులు ఒక వైపు, ఆకలి కేకలు ఒక వైపు అన్నాడు కాళోజీ, ఎందరో స్త్రీలు వివాహం అనే బంధిఖాన లో చిక్కుకు పోయి ఉన్నారు అని కొందరు రచయితలు ప్రపంచ వ్యాప్తంగా చెబుతున్నారు! వివాహం గోడలు బద్దలు గొట్టాలి అన్నారు కొందరు! మహాకవి చలం మన తెలుగులో స్త్రీ అనే గొప్ప పుస్తకం రాసి 106 సంవత్సరాలు అయ్యింది! తర్వాత రంగనాయకమ్మ, వేరే స్త్రీ వాద రచయిత్రులు దానిని కొనసాగించారు! గాలి, నీరు ఉచితంగా దొరుకుతున్నాయి! (దొరుకుతున్నాయి కదా?!) అలాగే శృంగారం, ప్రేమ కూడా స్వచ్ఛంగా మనుషుల మధ్య కలగాలి! ఉండాలి! దొరకాలి! లేదంటే ఇప్పుడు ఉన్న వందల కోట్ల మానసిక రోగుల జాబితాలో అందరం చేరిపోతాము!

మతం కోసం యుద్ధం, అహంకారం కోసం, ఆయిల్ కోసం, ఆధిపత్యం కోసం, మూర్ఘత్వం కోసం ఇన్ని లక్షల కోట్ల డాలర్లు వృథాగా పోతున్నాయి! ఎంతో పేదరికం, ఆకలి, నిరక్షరాస్యత… ఎన్నో దేశాల్లో ఉంది! UNO 17 Sustainable Goals ఎంత అమలు అవుతున్నాయో మీరే చూడండి!

యుద్ధం పేరుతో జరిగే ఈ ఖర్చు, నష్టం అసహజం కదా! లోకం తగల బడుతోంది! అగ్ని వర్షం అంటూ రోజూ వార్తలు! మహిళా దినోత్సవం! మన అమ్మ మహిళ! అమ్మ దృష్టి కోణంలో ఆలోచిద్దాం! సంస్కారం, అంతర్గత నీతి, ఔన్నత్యం… ఆడ అయినా మగ అయినా సమానం! శ్లోకం చెప్పి గౌరవం అడగ వొద్దు!

దుర్మార్గపు స్త్రీలకు, గయ్యాళి గంపలకు కూడా గౌరవం ఇవ్వాలి పూజించాలి అంటే కుదరదు! నేరాలు, హత్యలు, చీకటి తప్పులు వంద చేసి, దురహంకారంతో కంపు కొట్టే స్త్రీలకు కూడా స్త్రీ కాబట్టి శ్లోకం చెప్పి గౌరవం ఇవ్వండి అంటే చెల్లదు! నేరాలు చేసేసి, చెయ్యాల్సిన తప్పులు అన్నీ చేసేసి, అనాల్సిన మాటలు, చేతలు, తిట్లు, బూతులు అన్నీ అనేసి, woman card వెనుక, కులం కార్డు వెనుక, మతం కార్డు వెనుక దాక్కుంటున్నారు! చట్టం పేరుతో blackmailing! 498A ఎన్నో చోట్ల మిస్ యూస్ చేయడం, లేదంటే అట్రాసిటీ చట్టాలు మిస్ యూస్ చేయడం…. తప్పు! అతి తెలివి చూపిస్తూ కొందరు ఈ లొసుగులను Exploit చేసుకుంటున్నారు! ఇది దారుణం, మోసం! ఒక కుట్ర! దీని వలన నిజమైన బాధితుల వ్యథలు పలుచన అవుతాయి!

ప్రేమ సంబంధమే కానీ అధికార సంబంధం ఉండకూడదు అంటాడు చలం! ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది! కాయిన్ కి రెండు వైపులా మన అక్షరాలు చూడాలి!

గౌరవం పొందేలా మహిళల ప్రవర్తన, ప్రేమ, సహనం, సంస్కారం, ఔన్నత్యం, క్యారెక్టర్ ఉండాలి! ఎందరో బాధిత మహిళలు ఈరోజుకీ ఉన్నారు! ఎందరో స్త్రీల శ్రమ, సున్నితత్వం దోపిడీకి గురి అవుతోంది! వారి వైపు నిలబడడం ధర్మం!

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!

___________________________________________________________

5.వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

ప్రతిరోజూ స్వామి కి లెక్కలు చెప్పే కొలువు

తిరుమలేశుని ఆలయంలో స్వామివారికి ప్రతిరోజూ ముందురోజు ఆదాయ వ్యయాల వివరాలను తెలియచెప్పే సంప్రదాయం ఉంది. ప్రతిరోజూ ఉదయం గర్భాలయంలోని మూలమూర్తికి పుష్పాలంకారణ చేసే తోమాల సేవ ముగిసిన తరువాత కొలువు పేరుతో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది.


ఇందులో భాగంగా అర్చకులు మూలమూర్తికి ప్రతిరూపంగా గర్భాలయంలోని పంచ బేరాలలో ఒకటైన 2 అడుగుల పంచలోహ కొలువు శ్రీనివాసుని విగ్రహాన్ని బంగారువాకిలి ముందున్న ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన బంగారు సింహాసనంపై అధిరోహింపచేస్తారు. బంగారు గొడుగు నీడలో వింజామర సేవలు అందుకుంటూ సింహాసనంపై కొలువు తీరిన స్వామికి అర్చకులు సమస్త శైత్యోపచారాలు, ధూప దీప హారతులు ఇస్తారు.

తరువాత ఆస్థాన సిద్ధాంతి స్వామి కి నమస్కరించి ఆ నాటి తిధి వార నక్షత్ర,యోగ, కరణాలను తెలిపే పంచాంగ శ్రవణం చేస్తారు. ఆపై ఆలయ బొక్కసం (ట్రెజరీ ) అధికారి వచ్చి చేతులు కట్టుకుని వినయంగా నిలబడి ముందురోజు ఆలయానికి వచ్చిన ఆదాయ వ్యయాల వివరాలను తెలియచేసి ప్రభువుల వారు చిత్తగించవలెను అని చెప్పి సాష్టాంగ ప్రణామం చేస్తారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన అర్చకులు స్వామి తరపున 16 కిలోల బియ్యాన్ని మాత్రా దానం పేరుతో తాంబూలాలు స్వీకరించి స్వామి వారిని నిత్యైశ్వర్యో భవ అని ఆశీర్వదిస్తారు.

అనంతరం వేయించి బెల్లంతో కలిపిన నువ్వుల పిండి తో తయారు చేసిన ప్రసాదాన్ని స్వామి ని నైవేద్యంగా సమర్పించడంతో కార్యక్రమం ముగుస్తుంది. . ఈ కొలువు కార్యక్రమంలో పాల్గొనే మూర్తిని కొలువు శ్రీనివాసమూర్తి అని, దర్బార్ శ్రీనివాస మూర్తి అని పిలుస్తారు.


ఇక ఏడాదికి ఒకసారి స్వామి వారి వార్షిక ఆదాయ వ్యయాలను లెక్కకట్టి, సంబంధిత పద్దులు, రికార్డులను ఆలయ నిర్వహణ బాధ్యతలను కార్యనిర్వహణాధికారికి లాంఛనంగా అప్పగించే కార్యక్రమాన్ని ఆణివర ఆస్థానం అని పిలుస్తారు.

నిత్యం నిర్వహించే కొలువు సేవ ఎప్పుడు మొదలైందో తెలియక పోయినా 1843 జులై 16వ తేదీన బ్రిటిష్ వార్తు తిరుమల క్షేత్ర పాలనను మహంతు మఠానికి అప్పగించిన రోజును పురస్కరించుకుని ఆ రోజున ఆణివర ఆస్తానం అనే కార్యక్రమం కొనసాగుతూవస్తోంది

ఓం నమో వేంకటేశాయ

మరిన్ని చక్కటి వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@
gmail.com

click here for more

Leave a Reply