వెంటనే పరిష్కరించాలి

వెంటనే పరిష్కరించాలి

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : జిల్లాలో బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓకు సంబంధించి ఇంకనూ అపరిష్కృతంగా ఉన్న 82మంది ఓటర్ల అభ్యర్థనలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ (DK Balaji) ఎన్నికల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాష్ట్ర వ్యాప్తంగా బుక్ ఎ కాల్ విత్ బీఎల్ఓ పేరిట ఓటర్ల సౌకర్యం కోసం ఈసీఐ నెట్ ద్వారా నూతన విధానంలో ఒక వేదికను ఏర్పాటు చేశారని కలెక్టర్ వివరించారు. ఆ వేదికకు వచ్చిన అభ్యర్థనలను నిబంధనల ప్రకారం 48గంటల్లో పరిష్కరించాల్సి ఉందన్నారు. దీనివలన ఓటర్ల అనుభవం పెద్ద ఎత్తున పెరుగుతుందన్నారు.

అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియలో సమర్థతను పటిష్ట పరుస్తుందన్నారు. జిల్లాలో 7 శాసనసభ నియోజకవర్గాల (7 Assembly constituencies) కు సంబంధించి మొత్తం 99 అభ్యర్థనలు రాగా, అందులో ఇప్పటివరకు 16 అభ్యర్థనలు పరిష్కరించడం జరిగిందన్నారు. మిగిలిన 83 అభ్యర్థనలలో ఒకటి అందుబాటులో లేకపోగా.. మిగిలిన 82మంది అభ్యర్థనలు అలాగే అపరిస్కృతంగా ఉన్నాయన్నారు. వాటిని సంబంధిత నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారులు(ఈ.ఆర్.ఓ లు), ఏ ఈ ఆర్ ఓ లు తక్షణమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఓటర్లు తమకు సంబంధించిన ఎన్నికల విషయాలపై సమస్యలను బూతు స్థాయి అధికారులకు (బి ఎల్ ఓ లు) ఈసీఐ నెట్ ద్వారా కాల్ చేసే సౌకర్యము జిల్లా వ్యాప్తంగా ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. బుక్ ఏ కాల్ విత్ బి ఎల్ ఓ అవకాశాన్ని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Leave a Reply