నిర్దిష్ట గడువులోగా సమస్యలు పరిష్కరించాలి….

నిర్దిష్ట గడువులోగా సమస్యలు పరిష్కరించాలి….
జి.కొండూరు గ్రామాభివృద్ధికి కృషి.
- మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
75 మంది అర్జీలు సమర్పణ.
జి.కొండూరు, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అధికారులను ఆదేశించారు. ‘ప్రజాదర్బారు’ సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జి.కొండూరులోని కమ్యూనిటీ హాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ప్రజాదర్బారు’ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 75 మంది వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా విన్నారు.
ఆయా సమస్యలు పరిష్కరించాలని సంభందిత శాఖాధికారులను ఆదేశించారు. సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన ఎల్.ఓ.సిని లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ జి.కొండూరు గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. జి.కొండూరు నుంచి కొత్తూరు వెళ్లే రహదారి అభివృద్ధికి రూ.60 లక్షలు మంజూరు చేయగా, టెండర్ దశలో ఉందన్నారు.

జి.కొండూరులో శ్మశానవాటికకు వెళ్లేందుకు పులివాగుపై వంతెన నిర్మాణానికి రూ.65లక్షలతో ప్రతిపాదనలు పంపామని, మరో నెలలో ఇది కూడా మంజూరు అవుతుందన్నారు. జి.కొండూరు వై జంక్షన్ నుంచి తిరువూరు వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూ.3కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కరించేందుకు అన్ని మండల కేంద్రాల్లో వారంలో ఒక రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు ‘ప్రజాదర్బారు’ కార్యక్రమ నిర్వహణ నిదర్శనమన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ, రైస్ కార్డులు, ఉపాధి, పెన్షన్లు, దివ్యంగుల సర్టిఫికెట్లు మంజూరు, తాగునీటి పైప్ లైన్స్ నిర్మాణం, భూ సంభందిత సమస్యలు, రహదారుల అభివృద్ధి కోసం, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్వహణకు, వివిధ రెవెన్యూ సేవలు, పోలీసు సేవలకు సంబంధించి అర్జీలు వచ్చాయి. ప్రజదర్బార్ వేదికలో అన్నిశాఖల అధికారులు ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.

ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సెల్ సిస్టం (పి.జి.ఆర్.ఎస్) ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేసి జవాబుదారీతనంతో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం, సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రజలకు నాణ్యతతో కూడిన సేవలు అందించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రధాని మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

