7 days | శ్రీశైలంలో బ్రహ్మోత్సవం

7 days | శ్రీశైలంలో బ్రహ్మోత్సవం
- వైభవంగా పూర్ణాహుతి కార్యక్రమాలు
7 days | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజుల పాటు నిర్వహింపబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజైన శనివారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించినట్లు కార్య నిర్వాహణధికారి శ్రీనివాస రావు తెలిపారు. శ్రీస్వామివారి యాగశాలలో శ్రీచండీశ్వరస్వామివారికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయన్నారు. అనంతరం పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, మహదాశీర్వచనం జరిపించబడ్డాయన్నారు.

పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. అనంతరం వసంతోత్సవం జరిపించబడిందన్నారు. అనంతరం జరిగిన వసంతోత్సవంలో ఆలయ అర్చకులు, వేదపండితులు వసంతాన్ని (పసుపు, సున్నం కలిపిన మంత్ర పూరిత జలం) సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు.
తరువాత జరిగిన అవబృథస్నానంలో చండీశ్వరస్వామికి ఆలయ పుష్కరిణి వద్ద ఆగమ శాస్త్రోక్తంగా స్నపన కార్యక్రమం నిర్వహించబడింది. చివరగా త్రిశూలస్నాన కార్యక్రమం నిర్వహించబడిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికారి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు దేవకి వెంకటేశ్వర్లు, ప్రత్యేక ఆహ్వానితులు ఎ. శ్రీనివాసులు, ప్రధానార్చకులు స్థానాచార్యులు (అధ్యాపక) వేదపండితులు, అర్చకస్వాములు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
