50 lakhs | కేబీసీ విజేత అరెస్ట్

50 lakhs | కేబీసీ విజేత అరెస్ట్
50 lakhs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఒక మహిళా అధికారిణి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ టీవీ కార్యక్రమంలో రూ. 50 లక్షలు గెలుచుకున్నది. దీని వల్ల జాతీయ స్థాయిలో ఆమె గుర్తింపు పొందింది. అయితే ఆ మహిళా తహసీల్దార్ రూ.2.5 కోట్ల వరద సహాయ నిధుల స్కామ్‌లో అరెస్ట్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది.
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో రూ.50 లక్షలు గెలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మహిళా అధికారి ఇప్పుడు భారీ అవినీతి కేసులో అరెస్టు కావడం సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనలో తహసీల్దార్‌గా పనిచేసిన అమితా సింగ్ తోమర్‌పై రూ.2.5 కోట్ల వరద సహాయ నిధుల దుర్వినియోగం ఆరోపణలున్నాయి.
2021లో షియోపూర్ జిల్లాలోని బరోడా తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో, ఆమె కొంతమంది రెవెన్యూ అధికారులతో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో బయటపడింది. వరద బాధితులకు కేటాయించిన నిధులను నకిలీ బ్యాంకు ఖాతాలకు మళ్లించి దుర్వినియోగం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల ఫిర్యాదుతో ఎస్‌డీవోపీ అవనీత్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ప్రస్తుతం విజయపూర్ తహసీల్దార్‌గా ఉన్న అమితా సింగ్ తోమర్‌తో పాటు 22 మంది రెవెన్యూ సిబ్బంది సహా మొత్తం 110 మందిపై కేసులు నమోదు చేశారు.
కేసు నమోదు అనంతరం కొన్ని రోజులుగా విధులకు హాజరు కాకుండా ఉన్న అమితా సింగ్, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినా, ఆమె అభ్యర్థనలు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో అధికారులు ఆమెను పదవి నుంచి తొలగించారు. ఇక గ్వాలియర్‌లోని ఆమె నివాసంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గురువారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, శివపురి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
