40 trap cameras | మత్తుమందిచ్చి… బోనులో బంధించి..!

40 trap cameras | మత్తుమందిచ్చి… బోనులో బంధించి..!

  • అటవీ సిబ్బంది వలలో చిక్కిన మ్యాన్ ఈటర్..!
  • మూడు నెలలుగా ముచ్చెమటలు పట్టించి..ఇద్దరిని పొట్టన పెట్టుకున్న పెద్దపులి..!
  • చంద్రాపూర్ జిల్లా పొంగుర్ణ తాలూకాలో పట్టుబడ్డ పులి..!

40 trap cameras | ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : పొరుగు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో మూడు నెలలుగా ముప్పు తిప్పలు పెడుతున్న మ్యాన్ ఈటర్ పెద్దపులి(man-eater tiger)ని ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు నిర్బంధించారు. పులుల అభయారణ్యంగా పేరొoదిన చంద్రాపూర్ జిల్లా గోండ్ పిప్రి, పొంగుర్ణ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి ఇటీవల ఇద్దరు రైతు కూలీలను పొట్టన పెట్టుకుంది.

మ్యాన్ ఈటర్ గా హడలెత్తిస్తున్న ఈ పెద్దపులి కదలికలతో ఈ ప్రాంత గిరిజన గూడేల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత నెల రోజులుగా వంట చెరుకు కోసం, పంట చేనులోకి వెళ్లాలంటేనే భయంతో వణికి పోతున్నారు. ఈ పెద్దపులిని బంధించి తమ ప్రాణాలను కాపాడాలని గిరిజనులు ఆందోళన చేపట్టి అధికారులను కూడా నిలదీశారు.

తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో హడలెత్తిస్తున్న టీ..115 మగ పులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు నెల రోజులుగా గోండ్ పిప్రి, గడిచిరోలి, పొంగుర్ణ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్(search operation) చేపట్టారు. అటవీ సిబ్బంది పులి కదలికలను పసిగడుతూనే 40 ట్రాప్ కెమెరాలు(40 trap cameras) అమర్చి అనుక్షణం నిఘాతో పులి జాడ కనిపెట్టారు.

అవినాష్ అనే స్పెషలిస్ట్ షూటర్(specialist shooter) ను రంగంలోకి దించి మత్తుమందు ఎక్కు పెట్టి పెద్దపులిని ఏమార్చారు. మత్తులోకి జారుకున్న వెంటనే అక్కడ ఏర్పాటు చేసిన బోనులోకి పెద్దపులి వెళ్లడంతో అటవీ అధికారులు ఈరోజు చంద్రపూర్ పులుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. మూడున్నరేళ్ల మగపులిగా గుర్తించారు. పెద్దపులి ఎట్టకేలకు బోనులో చిక్కడంతో ఈ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply