40 percent | నష్టపరిహారం వెంటనే చెల్లించాలి

40 percent | నష్టపరిహారం వెంటనే చెల్లించాలి
- జాప్యం చేస్తే కలెక్టరేట్ దిగ్భంధనానికి దిగుతాం
40 percent | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : 2021 ఖరీఫ్ సీజన్లో కావేరి జాదూరకం పత్తి విత్తనాలు విత్తి తీవ్ర నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం వారి ఖాతాల్లో జమ చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జాప్యం కొనసాగితే కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్భంధనం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతులు ధర్నా నిర్వహించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వారి వివరాల ప్రకారం 2021 ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 18 మండలాల్లో 1,889 మంది రైతులు కావేరి జాదూరకం పత్తి పంటను సాగు చేశారు. అయితే కంపెనీ నకిలీ విత్తనాలు సరఫరా చేయడం వల్ల పంట దిగుబడి రాకపోయిందని తెలిపారు.

రైతుల ఆందోళనల నేపథ్యంలో శాస్త్రవేత్తలు పరిశీలించి మూడు నుండి ఏడు క్వింటాళ్ల వరకు దిగుబడి నష్టం జరిగినట్లు నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. జరిగిన నష్టానికి పరిహారంగా ఎకరాకు రూ.23,107 చొప్పున చెల్లించాలని కలెక్టర్ అధ్యక్షతన ఉన్న కమిటీ కంపెనీని ఆదేశించిందన్నారు. ఐదేళ్లు గడిచినా కంపెనీ ఒక్క పైసా కూడా చెల్లించకుండా రైతులను కోర్టులు, కమిషనర్ కార్యాలయాల చుట్టూ తిప్పుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో స్టే కోసం కంపెనీ చేసిన ప్రయత్నాన్ని వెనక్కు పంపి కమిషనర్ వద్ద అప్పీల్ చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు.

అనంతరం కమిషనర్ అధ్యక్షతన విచారణ జరిపి తుది తీర్పులో 40 శాతం నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారని చెప్పారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఆ మొత్తాన్ని కూడా చెల్లించకుండా కాలయాపన చేయడం క్షమించరానిదని మండిపడ్డారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రకటించిన 40 శాతం అయినా వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేసి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి దిగ్భంధనానికి దిగుతామని హెచ్చరించారు.
ధర్నా అనంతరం రైతు సంఘం ప్రతినిధులు కలెక్టర్ డాక్టర్ సిరిని కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏ. కృష్ణ, జిల్లా నాయకులు జి. ఆంజనేయులు, కావేరి కంపెనీ బాధిత రైతుల కమిటీ నాయకులు శివారెడ్డి, పెద్దారెడ్డి, నగేష్, కృష్ణారెడ్డి, మాణిక్యాలరెడ్డి, వెంకటరాముడు, భూపనపాడు రాజు, రంగన్న, జగన్నాథం, మహేశ్వర్‌రెడ్డి, కే. గిడ్డయ్య, భాస్కరరెడ్డి, రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వేణుగోపాల్, అశోక్‌కుమార్, ఎర్రమద్దిలేటి, ఎల్లయ్య, శేఖర్ అన్న, కే. నారాయణ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బాధిత రైతులు హాజరై తమ ఆవేదన వ్యక్తం చేశారు.
