భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : మొంథా తుఫాన్ మంగళవారం సాయంత్రం నుంచి తన తీవ్ర రూపాన్ని దాల్చడంతో వర్షంతో కూడిన ఈదురు గాలులతో తీవ్ర నష్టం ఏర్పడనుంది. తుఫాన్ ప్రభావంతో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణ, ఏలూరు, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపునుందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది.
ఈ అత్యవసర సమయంలో భారీ వరదలు, ప్రమాదాలు నెలకొంటే వాటిని ఎదుర్కొనేలా ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధం కావడంతో పాటు సరికొత్తగా డ్రోన్లను సిద్ధం చేస్తున్నారు. గతంలో విజయవాడలో వచ్చిన భారీ వరదల సమయంలో డ్రోన్లను ఉపయోగించి ఎన్నో సహాయ కార్యక్రమాలను, ఆహారాన్ని అందించడం చేశారు.
అదేవిధంగా ఈ తుఫాను ప్రభావంతో తలెత్తి ఇబ్బందులను అధిగమించేందుకు డ్రోన్లను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం రైతు గ్రూపులకు రాయితీపై డ్రోన్లను సరఫరా చేసింది. ఆయా సరఫరా చేసిన డ్రోన్లను తుఫాను ఎదుర్కొనేందుకు మండలాల వారీగా జాబితాని సేకరించి అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
ఇందుకోసం సుమారు 300 డ్రోన్లను సిద్ధంగా ఉంచారు. ఈ డ్రోన్లలో అత్యధికంగా గుంటూరులో 43, కాకినాడలో 41, పశ్చిమగోదావరి జిల్లాలో 39, ఏలూరులో 36, కోనసీమలో 34 , కృష్ణాలో 25, ఎన్టీఆర్ జిల్లాలో 33 చొప్పున సిద్ధం చేశారు. ఈదురు గాలులకు నేల వాలిన వృక్షాలను, విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు సుమారు 1100 జేసీబీలను, ప్రోక్లైన్లను, క్రేన్లను అధికారులు సిద్ధం చేశారు.

