కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే సదాశివపేటకు భారీ అభివృద్ధి

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే సదాశివపేటకు భారీ అభివృద్ధి
వార్డుకు రూ.8 కోట్లు చొప్పున, మొత్తం రూ.208 కోట్లు తీసుకొస్తా
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 9 )ఆంధ్రప్రభ): సదాశివపేట మున్సిపాలిటీలోని 26 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే, ప్రతి వార్డుకు రూ.8 కోట్ల చొప్పున సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి మొత్తం రూ.208 కోట్లు మంజూరు చేయించి పట్టణాభివృద్ధి చేపిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద స్థానిక ప్రజలతో ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల అభిప్రాయాలు, సమస్యలు, అభ్యర్థనలు విన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా ప్రజలకు పనులు చేసి పెట్టడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. 2013లో సదాశివపేట పట్టణంలోని నిరుపేదలకు 5,500 ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చానని గుర్తు చేసిన జగ్గారెడ్డి, అయితే అప్పటి స్థానిక నాయకులు పోలీసులను పెట్టి పేదలను తమ స్థలాల్లోకి రానివ్వకుండా తరిమేశారని ఆరోపించారు. ఆ 5,500 మందితో పాటు ప్రస్తుతం కిరాయి ఇళ్లలో నివసిస్తున్న వారికి కూడా ఇంటి స్థలాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. రూ.150 కోట్ల వ్యయంతో రెండేళ్లలో సదాశివపేట మున్సిపాలిటీకి మంజీరా నీటిని అందిస్తానని, పట్టణం మధ్యలోని పాత ప్రభుత్వాసుపత్రి వద్ద అందరికీ అందుబాటులో ఉండేలా కొత్త భవనం నిర్మిస్తామని తెలిపారు. మహిళల కోరిక మేరకు పిల్లలు, యువత కోసం స్విమ్మింగ్ పూల్, స్టేడియం కూడా నిర్మిస్తామని ప్రకటించారు. పదేళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హరీష్ రావు ఆర్థిక–నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేసినా సదాశివపేట మున్సిపాలిటీలో ఒక్క అభివృద్ధి పనিও చేయలేదని విమర్శించారు. 2014కు ముందు తాను చేసిన పనులే ఇప్పటికీ కనిపిస్తున్నాయన్నారు. అలాగే 2023 ఎన్నికల్లో తనను ఓడించేందుకు హరీష్ రావు సంగారెడ్డికి రూ.27 కోట్లు పంపించారని జగ్గారెడ్డి ఆరోపించారు. తట్టుకోలేని కష్టంలో ఉన్నవారు తన ఇంటి తలుపు తట్టాలని, తాను ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. ఈ మాటలు ఓట్ల కోసం చెప్పడం కాదని, గాంధీ మహాత్ముడి విగ్రహం సాక్షిగా ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా నిలబెట్టుకుంటానని తెలిపారు. సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 26 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని జగ్గారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
