22,952 homes | ఉగాది’ నాటికి సొంతింటి కల సాకారం కావాలి…

22,952 homes | ఉగాది’ నాటికి సొంతింటి కల సాకారం కావాలి…
- జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
22,952 homes | గుంటూరు, ఆంధ్రప్రభ : జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలను ఉగాది పండుగ నాటికే పూర్తి చేసి, లబ్ధిదారుల సొంతింటి కలను నిజం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి మండల ప్రత్యేక అధికారులు, ఎం.పి.డి.ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గృహ నిర్మాణం, ఉపాధి హామీ పనులపై ఆమె సమీక్ష జరిపారు. జిల్లాలో నిర్దేశించిన 22,952 గృహాలను గడువులోపు పూర్తి చేసేందుకు మున్సిపల్ కమిషనర్లు, ఎం.పి.డి.ఓలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రోజువారీ, వారం వారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలో నిలిపివేసిన కాంట్రాక్టర్లపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయంపై అవగాహన కల్పించాలని, బి.సి, ఎస్.సి అభ్యర్థులకు రూ.50 వేలు, ఎస్.టి అభ్యర్థులకు రూ.75 వేల అదనపు సాయం అందుతుందని కలెక్టర్ వివరించారు. ఉపాధి హామీ పథకం కింద 95 రోజుల పని కల్పించడంతో పాటు బిల్లుల చెల్లింపులు వెంటనే జరుగుతాయని తెలిపారు.
పి.యం.ఏ.వై 2.0 కింద మంజూరైన 1755 గృహాలలో ఇంకా ప్రారంభం కాని వాటిని తక్షణమే చేపట్టాలని సూచించారు. ప్రజలతో సక్రమంగా ప్రవర్తించాలని, కొన్ని మండలాల్లో ప్రజల అభిప్రాయాలు సానుకూలంగా లేవని, ఆ పరిస్థితిని వెంటనే చక్కదిద్దుకోవాలని అధికారులకు హితబోధ చేశారు. మరోవైపు, మంజూరైన ఉపాధి హామీ పనులన్నీ మార్చి 31 నాటికి పూర్తి కావాలని, ఇందులో ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదని కలెక్టర్ తేల్చి చెప్పారు.
ఏప్రిల్ 1 నుండి ‘జి రామ్ జి’ పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రస్తుత పనులను యుద్ధప్రతిపాదికన ముగించాలన్నారు. వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలను ఫిబ్రవరి 28 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా చేబ్రోలు, దుగ్గిరాల, తెనాలి మండలాల్లో ప్రగతి మెరుగుపడాలని, గ్రామాల్లో పారిశుధ్య కమిటీల సమావేశాలు నిర్వహిస్తూ ‘స్వచ్ఛ రథాలను’ అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ వి.జ్యోతి బసు, గృహ నిర్మాణ సంస్థ పీడీ ప్రసాద్, డ్వామా పీడీ వి.శంకర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
