అవినీతి రాజకీయాల పై అంతర్యుద్ధం..!

అవినీతి రాజకీయాల పై అంతర్యుద్ధం..!
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ: పేదోళ్ళ రాజ్య స్థాపన కోసం అగ్ర నాయకుల అవినీతి రాజకీయాల పై అంతర్యుద్ధం మొదలుపెట్టానని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బింగి శివ కిరణ్ స్పష్టం చేశారు. క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. ఇప్పటివరకు సేవా కార్యక్రమాల్లో నిరంతరం శ్రమించిన తనను, తన సేవ భావాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకంతోటే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు.
తాను కౌన్సిలర్ కావాలనే స్వార్థంతో కాకుండా ప్రజల పక్షాన నిలిచే నాయకుడి కోసమే తపిస్తున్నట్లు వివరించారు. 2016 నుండి ఇప్పటివరకు 500 మందికి రక్తదానం చేయడమే కాకుండా సూపర్ బజార్ సెంటర్ లో ఒక పాప వైద్య చికిత్సల కోసం 43 లక్షల సేకరించి అందించిన తనను ఈ వార్డు సభ్యులు ఆశీర్వదించాలని కోరారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఆ పార్టీ ఎమ్మెల్యేల గెలుపొందడంలో తాను సైతం కీలకంగా వ్యవహరించానని, అయినా చివరికి కాంగ్రెస్ పార్టీలో తనకు టికెట్ కేటాయించకుండా టిక్కెట్లు అమ్ముకోవడంతో విభేదించి నిస్వార్థ రాజకీయ సేవ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నిజాయితీకి ఓటు వేయాలన్న నినాదంతోనే కేవలం కుటుంబ సభ్యులతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు బింగి శివకుమార్ చెప్పారు. 20వ వార్డులో తనను,15వ వార్డులో పోటి పడుతున్న తన భార్య
బింగి శివాణి సింహం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
