20drillingpoints | పాతాళ గంగను వెలికితీస్తున్ననందీశ్వరుడు

20drillingpoints | భూగర్భ జలాలను చూపించిన నందీశ్వరుడు
వరుసగా విఫలమైన బోర్లు… రైతుకు చివరికి దొరికిన ఆశ
కర్ణాటక నుంచి చిత్తూరుకు వచ్చిన శరణ్య ఎద్దు
ఎద్దు చూపిన చోట బోరు వేయగా ఉబికి వచ్చిన నీరు
మూడు రాష్ట్రాల రైతులను ఆకర్షిస్తున్న ఆశ్చర్యకర ఘటన
మూఢనమ్మకమా? లేక ప్రకృతి అద్భుతమా? చర్చలు

ఒక్కొక్క‌సారి లోకంలో జ‌రుగుతున్న వింత‌లు చూస్తే ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఇలా కూడా అవుతుందా అని ముక్కున వేలేసుకోక త‌ప్ప‌దు. ప్ర‌కృతి ప‌రంగా జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌లు సైన్స్‌కు కూడా అంతుప‌ట్ట‌కుండా ఉంటున్నాయి. కొన్నిటిని మూఢ న‌మ్మ‌కాల‌ని నిపుణులు కొట్టి పారేసినా.. గ్రామీణంలో కొన్ని విశేషాలు నిజ‌మ‌ని నిరూపిస్తున్నాయి. ఒక ఎద్దు నీటి జాడ‌లు చూపించ‌డం విన‌డానికి వింత‌గా అనిపించినా.. ఇది నిజ‌మే. ఈ సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

(ఆంధ్రప్రభ ప్రతినిధి, చిత్తూరు) : ఆధునిక టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే స్థాయికి చేరుకుంది. ఉపగ్రహాలు భూమి లోపల ఉన్న ఖనిజాలను గుర్తిస్తాయి. కంప్యూటర్ పరికరాలు భూగర్భ జలాల మార్గాలను కూడా చూపగలుగుతున్నాయి. కానీ కొన్నిసార్లు ప్రకృతి మనిషి అంచనాలను మించి ఆశ్చర్యకరమైన సంఘటనలను చూపిస్తుంది. శాస్త్రం కూడా వెంటనే సమాధానం చెప్పలేని వింతలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి.

20drillingpoints

అలాంటి ఆశ్చర్యకర సంఘటన ఒకటి చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆధునిక పద్ధతులు విఫలమైన చోట ఒక మూగజీవి జియాలజిస్ట్ గా మారి రైతుకు జ‌ల మార్గం చూపిస్తుంద‌న్న వార్త ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు సరిహద్దు జిల్లాల్లో 20 వరకు బోరు పాయింట్లు ఈ నందీశ్వరుడు పెట్టినట్లు సమాచారం. 100 శాతం బోర్లు విజయవంతం కావడంతో ఈ నందీశ్వరుని కోసం మూడు రాష్ట్రాల ప్రజలు ఎగబడుతున్నారు.

చిత్తూరు జిల్లా వీకోట మండలం తెట్టు గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలంలో సాగునీటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. వ్యవసాయం చేయాలంటే నీరు ప్రాణాధారం. నీరు లేకపోతే రైతు కష్టానికి విలువ ఉండదు. ఈ ఆశతో అతను వరుసగా బోర్లు వేయించాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఆరు బోర్లు వేయించాడు. ప్రతి బోరు వెనుక లక్షల రూపాయల ఖర్చు పెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఒక్క చుక్క నీరు కూడా పడలేదు. పెట్టిన పెట్టుబడి మొత్తం భూమిలో కలిసిపోయింది. అప్పులు పెరిగిపోయాయి. రైతు తీవ్ర నిరాశలో పడిపోయాడు. ఇక నా పొలంలో నీరు రావడం అసాధ్యం అనే స్థితికి చేరుకున్నాడు.

20drillingpoints

ఈ సమయంలో అనుకోకుండా సోషల్ మీడియా అతనికి ఒక కొత్త ఆశ చూపించింది. ఒకరోజు రాత్రి అతను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుండగా కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు సత్య శనీశ్వర స్వామి దేవస్థానంకు చెందిన శరణ్య అనే ఎద్దు బోరు పాయింట్ పెట్టడం గురించి ఒక వీడియో కనిపించింది. ఆ వీడియోలో ఆ ఎద్దు భూగర్భంలో నీటి జాడను గుర్తిస్తుందని చెబుతున్నారు. ఎక్కడ బోరు వేయాలో అది సూచిస్తుందని అక్కడి రైతులు నమ్ముతున్నారు. మొదట ఇది వింతగా అనిపించినా, ఆ రైతు ఒకసారి ప్రయత్నిస్తే ఏమవుతుందని అనుకున్నాడు.

తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో సుమారు 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కర్ణాటకలోని చిక్మంగళూరు ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఉన్న దేవస్థానంలో శరణ్య అనే ఎద్దు యజమానులను కలిసి తన పరిస్థితిని వివరించాడు. మేము ఎన్నో బోర్లు వేసినా నీరు పడలేదు. మా పరిస్థితి చాలా కష్టంగా ఉంది. మీరు సహాయం చేయాలని వేడుకున్నాడు. దూర ప్రాంతం నుంచి వచ్చాడని తెలుసుకున్న యజమాని అతనికి ధైర్యం చెప్పాడు.

చివరకు ఆ ఎద్దును ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చేందుకు అనుమతి ఇచ్చాడు. ఆ ఎద్దు తెట్టు గ్రామానికి చేరుకుందన్న వార్త చుట్టుపక్కల గ్రామాలకు వేగంగా వ్యాపించింది. వెంటనే గ్రామస్తులు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. పొలంలోకి ఆ ఎద్దును వదిలారు. కొంతసేపు అది అటూ ఇటూ తిరుగుతూ పొలాన్ని పరిశీలించింది. కొద్దిసేపటి తర్వాత ఒక ప్రదేశంలో ఆగి అక్కడే మూత్ర విసర్జన చేసింది. గ్రామస్తుల నమ్మకం ప్రకారం ఎద్దు ఎక్కడ ఇలా చేస్తుందో అక్కడ భూగర్భంలో నీటి నిల్వలు ఉంటాయని భావిస్తారు.

20drillingpoints

ఆ సమయంలో రైతు ఆ ఎద్దు కాళ్లపై పడిపోయి తన పొలంలో నీరు పడాలని ప్రార్థించాడు. గ్రామస్తుల మాటల్లో చెప్పాలంటే ఆ ఎద్దు తన కాలు తీసి రైతు భుజంపై పెట్టింది. ప్రతి 100 అడుగులకు ఒకసారి ఎద్దు తన కాలు రైతు భుజంపై పెడుతుందని అక్కడి వారు చెబుతున్నారు. అలా ఎన్ని సార్లు పెడితే అంత లోతులో నీరు ఉంటుందని వారు నమ్ముతున్నారు.

ఒకవేళ ఆ ప్రాంతంలో నీళ్లు లేకపోతే రైతు ఎంత ప్రార్థించినా ఆ ఎద్దు తన కాలు అతనిపై పెట్టదని కూడా చెబుతున్నారు. ఎద్దు సూచించిన ప్రదేశంలో వెంటనే బోరు బండి తీసుకొచ్చి డ్రిల్లింగ్ ప్రారంభించారు. గ్రామస్తులందరూ ఆసక్తిగా ఆ ప్రక్రియను గమనించారు. ఆశ్చర్యకరంగా బోరు వేయడం జరుగుతున్నంతసేపు ఆ ఎద్దు అక్కడి నుంచి కదల్లేదని అక్కడి వారు చెబుతున్నారు. కొంతసేపటి తర్వాత భూమి పొరలను దాటి నీరు పైకి రావడం ప్రారంభమైంది.

బోరు నుంచి నీరు ఉబికి రావడంతో రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతని కళ్లలో కనిపించిన ఆనందం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించింది. నీరు వచ్చిన తర్వాత ఆ ఎద్దు బోరు దగ్గరికి వెళ్లి నీటిని తన నోటితో తాకి, ఆ రైతును ఆశీర్వదించింది. ఈ దృశ్యం చూసిన ప్రజలు భక్తితో పులకించిపోయారు. కొందరు దీనిని గంగమ్మ ఆశీర్వాదంగా భావిస్తున్నారు. రైతు కుటుంబ సభ్యులు కూడా ఆనందంతో దేవుడికి మొక్కులు పెట్టారు.

ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులు ఇప్పుడు ఆ ఎద్దు యజమానిని సంప్రదిస్తున్నారు. తమ పొలాల్లో కూడా బోరు పాయింట్ చూపించాలని వందలాది మంది రైతులు కోరుతున్నట్లు సమాచారం. కొందరు రైతులు ఇప్పటికే తేదీలు కూడా అడుగుతున్నారని చెబుతున్నారు. ఈ సంఘటనపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది మూఢనమ్మకమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం దీనిని దైవిక శక్తిగా భావిస్తున్నారు.

  • సాటి గంగాధర్, చిత్తూరు బ్యూరో చీఫ్, ఆంధ్రప్రభ.

click here to read

click here to read more

Leave a Reply